Russia: పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి నిజమే.. అమెరికాకు ఆధారాలు సమర్పించిన రష్యా
ఈ వార్తాకథనం ఏంటి
యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగినట్టు వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన వెనుక ఉక్రెయిన్ సేనలే ఉన్నాయంటూ రష్యా మొదటినుంచీ ఆరోపిస్తోంది. అయితే పలు దేశాలు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్న నేపథ్యంలో, దాడి నిజమేనని నిరూపించేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా డ్రోన్ దాడికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికాకు అందజేసింది. దీనికి సంబంధించిన వీడియోను రష్యా రక్షణ మంత్రిత్వశాఖ విడుదల చేసింది.
వివరాలు
దాడిలో వినియోగించిన మానవరహిత విమానాల శకలాలు
ఈ నేపథ్యంలో రష్యా సైనిక నిఘా విభాగం అధిపతి అడ్మిరల్ ఇగోర్ కోస్ట్యుకోవ్ మాస్కోలో యూఎస్ మిలిటరీ అటాచ్ అధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో కోస్ట్యుకోవ్ మాట్లాడుతూ, దాడిలో వినియోగించిన మానవరహిత విమానాల శకలాలు తమకు లభ్యమయ్యాయని వెల్లడించారు. రష్యా దళాలు కూల్చివేసిన పలువురు డ్రోన్లలో నేవిగేషన్ వ్యవస్థలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. వాటిని ప్రత్యేక నిపుణులతో పరిశీలించగా, డ్రోన్ దాడుల లక్ష్యం నోవ్‌గొరొడ్ ప్రాంతంలో ఉన్న అధ్యక్షుడు పుతిన్ నివాసమేనని నిర్ధారణకు వచ్చామని చెప్పారు. ఈ వివరాలన్నింటినీ అమెరికా అధికారులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
వివరాలు
నాటో సభ్యదేశాలు కూడా మాస్కో వాదనకు మద్దతు ఇవ్వలేదు
ఇదిలా ఉండగా, ఈ దాడికి తామే కారణమన్న రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ప్రభుత్వం ఖండించింది. నాటో సభ్యదేశాలు కూడా మాస్కో వాదనకు మద్దతు ఇవ్వలేదు. మరోవైపు కీవ్ దాడికి ప్రయత్నించిందన్న విషయానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రోన్ దాడికి సంబంధించిన ఆధారాలను రష్యా అమెరికాకు అందజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.