Russia: ఉక్రెయిన్‌పై కొత్త ఒరెష్నిక్ ఇంటర్మిడియెట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణితో రష్యా దాడి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరాయి. ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయంటూ క్రెమ్లిన్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు ప్రతీకారంగా మాస్కో తాజాగా ఉక్రెయిన్‌పై అత్యాధునిక ఒరెష్నిక్ క్షిపణితో దాడి చేసింది. ధ్వని వేగానికి పదిరెట్లు అధికంగా దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ ఒరెష్నిక్ బాలిస్టిక్ మిస్సైల్‌ను గురువారం అర్ధరాత్రి ఉక్రెయిన్ పశ్చిమ భాగంలోని లివివ్ ప్రాంతంపై ప్రయోగించినట్లు వెల్లడైంది. పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ దాడులకే ప్రతిస్పందనగా ఈ క్షిపణి దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వివరాలు
ఉక్రెయిన్ భూగర్భ సహజ వాయువు నిల్వలే ఈ దాడి లక్ష్యమన్న ప్రచారం
ఈ దాడితో ఉక్రెయిన్‌కు చెందిన కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. అయితే క్షిపణిని కచ్చితంగా ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించామన్న వివరాలను మాస్కో బయటపెట్టలేదు. అయినప్పటికీ, ఉక్రెయిన్ భూగర్భ సహజ వాయువు నిల్వలే ఈ దాడి లక్ష్యమన్న ప్రచారం కొనసాగుతోంది. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధికారులు స్పందించారు. రష్యా దాడుల్లో నలుగురు మృతి చెందగా, మరో 22 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఒరెష్నిక్ క్షిపణితో పాటు మొత్తం 36 మిస్సైళ్లను, 242 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని కీవ్ ఆరోపించింది. నాటో సరిహద్దుకు సమీపంలో ఒరెష్నిక్ క్షిపణి పడిందని, ఇది యూరప్ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.
వివరాలు
ఒరెష్నిక్ గంటకు సుమారు 13 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు
యూరప్ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం కలిగిన క్షిపణుల్లో ఒరెష్నిక్ ఒకటిగా రష్యా పేర్కొంటోంది. రష్యన్ భాషలో ఒరెష్నిక్ అనే పదానికి హేజల్‌నట్ చెట్టు అనే అర్థం ఉంది. సాధారణంగా మాస్కో అభివృద్ధి చేసే క్షిపణులకు చెట్ల పేర్లు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మధ్యస్థాయి క్షిపణిగా గుర్తింపు పొందిన ఒరెష్నిక్ గంటకు సుమారు 13 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ఇది ధ్వని వేగానికి పదిరెట్లు వేగంగా దూసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. యూరప్‌లోని అన్ని దేశాలు ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని రష్యా మిస్సైల్ ఫోర్సెస్ చీఫ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మిస్సైల్‌ను అడ్డుకునే సామర్థ్యం గల ఆయుధ వ్యవస్థ ఏదీ లేదని కూడా ఆయన పేర్కొన్నారు.
వివరాలు
2024 నవంబరులో ఉక్రెయిన్‌లోని ఒక ఫ్యాక్టరీపై ఒరెష్నిక్ క్షిపణి ప్రయోగం
ఈ ఒరెష్నిక్ క్షిపణిని తొలిసారిగా 2024 నవంబరులో ఉక్రెయిన్‌లోని ఒక ఫ్యాక్టరీపై ప్రయోగించారు. ఆ సమయంలో ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ, తాజాగా పూర్తిస్థాయిలో వినియోగానికి సిద్ధం చేసినట్లు రష్యా తెలిపింది. అంతేకాకుండా, రష్యా మిత్రదేశమైన బెలారస్‌కు కూడా ఈ క్షిపణులను తరలించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అణు బాంబులతో పాటు ఒకేసారి అనేక వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఈ ఒరెష్నిక్‌కు ఉందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.