Page Loader
Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం
ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం

Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటికే మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు చేపట్టిన ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. ఇటీవల తుర్కియేలో ఇస్తాంబుల్‌ నగరంలోని సిరగాన్‌ ప్యాలెస్‌లో జరిగిన రెండో విడత చర్చలు ఎటువంటి స్పష్టమైన ఫలితాన్ని ఇవ్వలేదు. చర్చల కంటే ఒక్కరోజు ముందే ఉక్రెయిన్‌ భారీ వైమానిక దాడికి పాల్పడి,రష్యా వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంతో చర్చల వాతావరణం ఉత్కంఠతో నిండిపోయింది. ఈ పరిణామం చర్చలపై నెగెటివ్‌ ప్రభావం చూపింది.చర్చలకు తుర్కియే విదేశాంగ శాఖ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ అధ్యక్షత వహించగా, ఉక్రెయిన్‌ తరఫున రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్,రష్యా తరఫున అధ్యక్షుడు పుతిన్‌ సలహాదారు వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ పాల్గొన్నారు. ప్రధానంగా కాల్పుల విరమణపై చర్చలు సాగినప్పటికీ,ఎలాంటి ఒప్పందం కుదిరిందన్న విషయాన్నిఏ దేశం అధికారికంగా ప్రకటించలేదు.

వివరాలు 

ఉక్రెయిన్‌ దాడులతో రష్యాకు భారీ నష్టం 

ఇలాంటి చర్చలు ఇదివరకూ మే 16న కూడా ఇస్తాంబుల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కాల్పుల విరమణపై స్పష్టత రాకపోయినా, రెండు దేశాలు యుద్ధ ఖైదీల మార్పిడికి అంగీకరించడం ఊరటనిచ్చింది. తాజాగా జరిగిన చర్చల అనంతరం లిథువేనియాలో ఉన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ, ఇంకా ఎక్కువ మంది యుద్ధ ఖైదీల విడుదల కోసం చొరవ తీసుకుంటామని వెల్లడించారు. తమ దాడుల్లో రష్యా భారీ నష్టాన్ని చవిచూసిందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. దాదాపు ఏడాదిన్నర నుంచి ప్రణాళిక రచించి, ఇటీవల రష్యాపై ఉక్రెయిన్‌ చేపట్టిన పెద్దస్థాయి దాడిలో 117 డ్రోన్లను వినియోగించారు. ఈ దాడుల వల్ల రష్యా వైమానిక సామర్థ్యంలో 34 శాతం నష్టం వాటిల్లిందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

వివరాలు 

నిమిషం మాత్రమే వార్త ప్రసారం

ఈ డ్రోన్లను చెక్క పెట్టెల్లో పెట్టి రష్యాలోకి రహస్యంగా తరలించారని, అక్కడి సెక్యూరిటీ సర్వీసెస్‌ కార్యాలయం సమీపంలో నుంచే వాటిని ప్రయోగించినట్లు వెల్లడించారు. అంత పెద్ద స్థాయిలో దాడి జరిగినా, రష్యా మీడియా దీన్ని పెద్దగా ప్రచారం చేయలేదు. రష్యా-1 అనే అధికార టీవీ ఛానెల్‌లో ఈ దాడిపై కేవలం ఒక నిమిషం మాత్రమే వార్త ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. అయితే దాని తర్వాత ఉక్రెయిన్‌పై తమ దాడుల గురించి మాత్రం విస్తృతంగా కవరేజ్‌ ఇచ్చారు.

వివరాలు 

విజయం సాధించామన్న ధోరణిలో ఉక్రెయిన్‌ 

ఆదివారం జరిగిన దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు నాశనమయ్యాయి. ఉక్రెయిన్‌ ఈ దాడిని ఒక గణనీయమైన విజయంగా పేర్కొంటోంది. భౌగోళికంగా చూస్తే ఇది ఆశ్చర్యపరిచే స్థాయిలో జరిగిన దాడిగా ఉక్రెయిన్‌ చెబుతోంది. సైబీరియాలోని ఆర్కిటిక్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని, 7,000 కిలోమీటర్ల దూరంలోని రష్యా ప్రాంతాలను ఛేదించగలిగామని ప్రకటించారు. అయితే ఈ దాడులు రష్యా భూభాగంలో నుంచే నిర్వహించబడినట్లు స్పష్టం చేశారు. ఈ దాడులకు ప్రణాళిక రూపొందించిన ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ చీఫ్‌ వసిల్‌ మాలియక్‌ ప్రకారం, ఇది రష్యా మిలిటరీకి గట్టి షాక్‌గా మారింది.

వివరాలు 

ఆపరేషన్‌కు "స్పైడర్‌ వెబ్‌" కోడ్‌ నేమ్‌

అధ్యక్షుడు జెలెన్‌స్కీ దీనిని అత్యంత తెలివైన ఆపరేషన్‌గా అభివర్ణించారు. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి డైరెక్ట్‌గా డ్రోన్‌ దాడులు చేయడం ఒక సాహసోపేతమైన చర్యగా కొనియాడారు. సోషల్‌ మీడియాలో (ఎక్స్‌ - మాజీ ట్విట్టర్‌) ఆయన స్పందిస్తూ, ఉక్రెయిన్‌ సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్‌ చేపట్టాయని ప్రశంసించారు. రష్యా యొక్క 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్‌కు "స్పైడర్‌ వెబ్‌" అనే కోడ్‌ నేమ్‌ పెట్టినట్లు కూడా వెల్లడించారు.