Loading...
Russia: రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురి మృతి
రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురి మృతి

Russia: రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలోని నల్లసముద్ర తీరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్రాస్నోడర్ రీజియన్‌లోని ఆర్ఖిపో-ఓసిపోవ్కా బీచ్‌లో పర్యాటకులు అధిక సంఖ్యలో విహరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా,మరో 40 మంది గాయపడ్డారు. స్థానిక అధికారుల వివరాల ప్రకారం,గాయపడిన వారిలో 21 మందిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. బీచ్ వైపు వేగంగా వచ్చిన డ్రోన్ భారీ శబ్దంతో పేలిపోవడంతో అక్కడ ఉన్న పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురై ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. పేలుడు సంభవించే ముందు గాలిలో కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

వివరాలు 

రష్యా వైమానిక వ్యవస్థ వల్లే ప్రమాదం జరిగిందన్న ఉక్రెయిన్

డ్రోన్‌ను కూల్చివేయడానికి రష్యా వైమానిక దళాలు ప్రయత్నించి ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనకు ఉక్రెయిన్ బాధ్యత వహించాలని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది.

పౌరులనే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఉగ్రవాద తరహా వ్యూహాలను అమలు చేస్తోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా విమర్శించారు.

అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ పూర్తిగా ఖండించింది.

రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ డ్రోన్‌ను జనావాసాల మధ్య కూల్చివేయడం వల్లే పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారి ఆండ్రీ కోవెలెంకో పేర్కొన్నారు.

తమ లక్ష్యం రష్యాకు చెందిన సైనిక, పారిశ్రామిక స్థావరాలేనని, పౌరులపై దాడులు చేయడం తమ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

పౌరుల భద్రతపై ప్రశ్నలు

ఇటీవలి కాలంలో క్రాస్నోడర్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలు, నౌకాదళ స్థావరాలపై డ్రోన్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.

యుద్ధ క్షేత్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా పౌరుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఘటనాస్థలంలో సహాయక బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తూ, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.

గమనిక: రష్యా ఈ దాడికి ఉక్రెయిన్‌ను బాధ్యురాలిగా ఆరోపించగా, ఉక్రెయిన్ ఆ ఆరోపణలను ఖండించింది. ఘటనకు సంబంధించిన పూర్తి పరిస్థితులపై స్వతంత్ర ధృవీకరణ ఇంకా వెలువడలేదు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యా బీచ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

ADVERTISEMENT