Russia vs Ukraine: ఉక్రెయిన్ గ్రామంపై రష్యా బాంబుల వర్షం.. 26 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఐదేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరోసారి భారీ ప్రాణనష్టం సంభవించింది. ఉక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతంలో ఓ గ్రామంపై రష్యా బలగాలు జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన వారికి మానవతా సాయం అందించే కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. నిరాశ్రయులకు సహాయం పంపిణీ చేసేందుకు ఉపయోగిస్తున్న ఓ పాఠశాల భవనంతో పాటు దాని సమీపంలోని షెల్టర్‌పై రష్యా బలగాలు 10 గైడెడ్ బాంబులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. రష్యాకు ఉద్రిక్తతలు తగ్గించే ఉద్దేశం లేదనడానికి ఈ దాడులే నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
వివరాలు
ఉక్రెయిన్, రష్యా దేశాల్లో ప్రభుత్వ అత్యవసర హెచ్చరికల యాప్‌లపై సైబర్ దాడులు
మరోవైపు, ఉక్రెయిన్‌కు చెందిన 212 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఐరోపాలో అతిపెద్ద చమురు సరఫరా కేంద్రాల్లో ఒకటైన సమారా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని తెలిపింది.
అయితే, తమ గగనతల రక్షణ వ్యవస్థ ఆ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్, రష్యా దేశాల్లో ప్రభుత్వ అత్యవసర హెచ్చరికల యాప్‌లపై సైబర్ దాడులు జరిగాయి.
అణు ముప్పు, రేడియేషన్, రసాయన దాడులు పొంచి ఉన్నాయంటూ సైబర్ నేరస్థులు ప్రజలకు నకిలీ సందేశాలు పంపించారు. దీంతో ఇరుదేశాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.