Russia-Ukraine: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని దినిప్రో రైల్వే స్టేషన్‌లో డ్రోన్ దాడి కలకలం రేపింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలును లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం ఈ దాడి జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. జపోరిజియాకు వెళ్లాల్సిన రైలు దినిప్రో రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆ సమయంలో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. వైమానిక దాడుల హెచ్చరికల కోసం ఎయిర్ సైరన్లు మోగించినప్పటికీ.. ప్రయాణికులు వాటిని పట్టించుకోలేదని స్థానిక అధికారులు తెలిపారు.
వివరాలు
రష్యాపై మళ్లీ కఠిన ఆంక్షలు విధించాలి: జెలెన్‌స్కీ
దాడి ముప్పు గురించి హెచ్చరించినా అప్రమత్తం కాకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు పేర్కొన్నారు.
ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా రష్యాపై మండిపడ్డారు.
రష్యా సంపన్నులు, ఆ దేశ ఇంధన రంగంపై పశ్చిమ దేశాలు ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే మాస్కో తమపై మరింత తీవ్రంగా దాడులకు దిగుతోందని ఆరోపించారు.
రష్యా యుద్ధ సామర్థ్యాన్ని దెబ్బతీయాలంటే ఆ దేశంపై మళ్లీ కఠిన ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ), అమెరికా, జీ7 కూటమిని కోరారు.