Loading...
Jared Kushner: ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఫోన్ హ్యాక్.. సౌదీ, యూఏఈతో ఆర్థిక సంబంధాలపై కథనం
సౌదీ,యూఏఈతో ఆర్థిక సంబంధాలపై కథనం

Jared Kushner: ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఫోన్ హ్యాక్.. సౌదీ, యూఏఈతో ఆర్థిక సంబంధాలపై కథనం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఆయన మాజీ సలహాదారు జారెడ్ కుష్నర్‌కు సంబంధించిన ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నాయకత్వంతో ఆయనకు ఉన్నట్లు ఆరోపిస్తున్న రహస్య ఆర్థిక, దౌత్య సంబంధాలకు సంబంధించిన వివరాలు ఈ హ్యాకింగ్ ద్వారా వెలుగులోకి వచ్చినట్లు 'వానిటీ ఫెయిర్' ప్రచురించిన పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలను కుష్నర్ తీవ్రంగా ఖండించారు.

వివరాలు 

ఓ బ్యాంకు ద్వారా వందల కోట్ల డాలర్లు

వానిటీ ఫెయిర్ కథనం ప్రకారం.. 2017లో డచ్ నిఘా అధికారులు రష్యా సైనిక నిఘా విభాగానికి చెందిన సర్వర్‌లోకి ప్రవేశించారు.

ఆ సమయంలో కుష్నర్ ఐఫోన్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను గుర్తించారు.

రష్యా హ్యాకర్ నుంచి సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన డచ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ (ఎంఐవీడీ) ఈ వివరాలను గుర్తించినట్లు కథనం పేర్కొంది.

కుష్నర్‌కు యూఏఈలోని ఓ బ్యాంకు ఖాతాను నిర్వహించే అధికారం ఉన్నట్లు డచ్ నిఘా అధికారులు గుర్తించారని తెలిపింది.

అజర్‌బైజాన్‌లోని ఓ బ్యాంకు ద్వారా ఆ ఖాతాలోకి వందల కోట్ల డాలర్లు వచ్చినట్లు కథనంలో ఆరోపించింది.

వివరాలు 

కుష్నర్‌కు ఖాతాల్లోకి మొత్తం 2 బిలియన్ డాలర్లకు పైగా జమ

అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన 2018లో చర్చకు వచ్చినట్లు వానిటీ ఫెయిర్ కథనం వెల్లడించింది.

సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ నాయకత్వానికి చెందిన వ్యక్తులు ఈ ప్రతిపాదనలో భాగమైనట్లు పేర్కొంది.

ఈ నిధి కోసం 10 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించే అంశంపై చర్చలు జరిగినట్లు తెలిపింది.

అయితే, ఆ తర్వాత ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు వివరించింది. అనంతరం కుష్నర్‌కు చెందిన రెండు ఖాతాల్లోకి మొత్తం 2 బిలియన్ డాలర్లకు పైగా జమ అయినట్లు కథనం ఆరోపించింది.

ADVERTISEMENT

వివరాలు 

చర్చకు ఆర్థిక లావాదేవీల ఆరోపణలు

ఈ ఆరోపణలపై కుష్నర్ తరఫు న్యాయవాది తీవ్రంగా స్పందించారు.

వానిటీ ఫెయిర్ ప్రచురించిన కథనంలోని ఆరోపణలను ఆధారాలు లేని కల్పిత కథనాలుగా అభివర్ణించారు.

విదేశీ నాయకులతో కుష్నర్ చేసినట్లు ఆరోపిస్తున్న ఒప్పందాలు, ఏర్పాట్లు అమెరికా అధ్యక్షుడి అనుమతి లేకుండా జరగలేదని ఆయన తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.

ఈ కథనాన్ని ప్రచురించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీంతో కుష్నర్ ఫోన్ హ్యాకింగ్, ఆయనకు సంబంధించినట్లు కథనంలో పేర్కొన్న ఆర్థిక లావాదేవీల ఆరోపణలు చర్చకు దారితీశాయి.

ADVERTISEMENT