ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర; మహిళ అరెస్టు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్(ఎస్‌బీయూ) వర్గాలు వెల్లడించాయి. జులై 27 జెలెన్‌స్కీ హత్యకు పథకం రచించినట్లు తెలిపాయి. దక్షిణ మైకోలైవ్‌లోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా అధ్యక్షుడి హత్యకు కుట్ర జరిగినట్లు ఎస్‌బీయూ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఉక్రెయిన్ ఆర్మీ స్టోరులో పనిచేసిన ఒక మహిళ రష్యాకు గూఢచర్యం చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం గుర్తించింది. ఈ నేపేథ్యంలో ఆమెను అరెస్టు చేసిన విచారిస్తున్నారు. ఈ కేసులో నేరం చేసినట్ల రుజువైతే ఆమెకు దాదాపు 12ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
జెలెన్‌స్కీపై వైమానిక దాడులకు రష్యా కుట్ర?
జెలెన్‌స్కీ మైకోలైవ్ పర్యటన షెడ్యూల్ వివరాలను ముందుగానే రష్యాకు ఆ మహిళ పంపినట్లు ఎస్‌బీయూ తెలిపింది. అంతేకాకుండా జెలెన్‌స్కీ మైకోలైవ్‌లో పర్యటించే అన్ని ప్రంతాల ఫోటోలను ఆ మహిళ రహస్యంగా రష్యాకు పంపినట్లు చెప్పింది. ఈ మహిళ ఇచ్చే సమాచారం ఆధారంగా రష్యా జెలెన్‌స్కీపై వైమానిక దాడులు చేయాలని భావించినట్లు ఎస్‌బీయూ పేర్కొంది. ఈ విషయం ముందుగానే తెలుసుకొని అధ్యక్షుడికి అదనపు భద్రత కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. జెలెన్‌స్కీ హత్యకు కుట్ర పన్నిన విషయం నిర్ధారణ అయిన తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే ఆ మహిళ వివరాలను సెక్యూరిటీ అధికారులు వెల్లడించలేదు.