LOADING...
Saudi Arabia: 7,200కు పైగా వర్క్ వీసాలను రద్దు చేసిన సౌదీ అరేబియా 
7,200కు పైగా వర్క్ వీసాలను రద్దు చేసిన సౌదీ అరేబియా

Saudi Arabia: 7,200కు పైగా వర్క్ వీసాలను రద్దు చేసిన సౌదీ అరేబియా 

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌదీ అరేబియాలో నకిలీ "సౌదీకరణ"(fake saudization)కు పాల్పడుతున్న సంస్థలపై కేంద్ర మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉక్కుపాదం మోపింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో చేపట్టిన విస్తృత తనిఖీల్లో వేల సంఖ్యలో అక్రమాలు బయటపడటంతో, 7,200కు పైగా వర్క్ వీసాలను అధికారులు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ సంస్థలపై శాఖ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ చర్యలు తీసుకుంది. అత్యాధునిక నిఘా వ్యవస్థల సహాయంతో మొత్తం 91 వేల అనుమానాస్పద కేసులను పరిశీలించిన అధికారులు, అందులో 13,509 నకిలీ సౌదీకరణ ఘటనలను గుర్తించారు. కొన్ని సంస్థలు సౌదీ పౌరులను కేవలం పేరుకే ఉద్యోగాల్లో చూపిస్తూ "నితాఖత్" పథకం ప్రయోజనాలు పొందుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

వివరాలు 

మొత్తం 1.68 లక్షల కార్మిక నిబంధనల ఉల్లంఘనలు

దీంతో మోసపూరితంగా నమోదు చేసిన ఉద్యోగులను నితాఖత్ జాబితా నుంచి తొలగించి, వారికి వాస్తవ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మానవ వనరుల అభివృద్ధి నిధికి బదిలీ చేశారు. మొదటి త్రైమాసికంలో తనిఖీ బృందాలు దాదాపు 2.5 లక్షల సంస్థలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. ఈ తనిఖీల్లో మొత్తం 1.68 లక్షల కార్మిక నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 2.30 లక్షల సంస్థలకు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తూ, తమ పరిస్థితిని వెంటనే సరిచేసుకోవాలని ఆదేశించారు.

వివరాలు 

238 సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా చర్యలు

రిక్రూట్మెంట్ కార్యాలయాలపై నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 3,522 ఉల్లంఘనలు వెలుగుచూశాయి. గృహ కార్మికుల సేవలను చట్టవిరుద్ధంగా ప్రచారం చేసినందుకు 238 సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అనుమానిత మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 54 వేల కేసులను మంత్రిత్వ శాఖ విచారించినట్లు తెలిపింది. ప్రజల నుంచి అందిన 15,563 ఫిర్యాదుల్లో ఎక్కువ భాగాన్ని నిర్ణీత గడువులోనే పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement