LOADING...
Trump-Epstein: ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం.. ట్రంప్ టేబుల్ మీదకు బిల్లు… 
ట్రంప్ టేబుల్ మీదకు బిల్లు…

Trump-Epstein: ఎప్‌స్టీన్ ఫైళ్ల విడుదల బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ ఆమోదం.. ట్రంప్ టేబుల్ మీదకు బిల్లు… 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా రాజకీయ వర్గాల్ని ఎన్నాళ్లుగానో వెంటాడుతున్న జెఫ్రీఎప్‌స్టీన్‌ సెక్స్‌ స్కాండల్‌ మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లను పబ్లిక్‌ చేయడానికి రూపొందించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. మొత్తం 428మంది సభ్యుల్లో 427మంది అనుకూలంగా ఓటేయగా,ట్రంప్‌కు కట్టుబడి ఉన్న లూసియానా రిపబ్లికన్‌ క్లే హిగ్గిన్స్ మాత్రమే పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. ట్రంప్‌ స్వయంగా సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లుకు వ్యతిరేకంగా నిలవాలని కోరినా,చాలా మంది లీడర్లు అయన ఆదేశాలను పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈకేసులో బాధితుల సంఖ్య వెయ్యి దాటుతుందని సభ్యులే చెబుతున్నారు. ఎన్నేళ్లుగా రహస్యంగా ఉన్న ఆ ఫైళ్లు విడుదలకు కాంగ్రెస్‌ అనుమతి ఇచ్చిన వెంటనే అమెరికా రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది.

వివరాలు 

జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు

బిల్లు ఇప్పుడు ట్రంప్‌ ఎదుట ఉంది. ఆయన సంతకం చేస్తారా లేదా అన్నది కీలకంగా మారింది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మైనర్‌ బాలికల సరఫరాలో ఆయన పాత్ర ఉందని కూడా ఇంతకుముందు విమర్శలు వచ్చాయి. అయితే ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్‌హౌస్‌లో సమావేశం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, ఎప్‌స్టీన్‌తో తనకు అసలు సంబంధం లేదని, అతడు వక్రబుద్ధి కలిగిన ప్రమాదకర వ్యక్తి అని వ్యాఖ్యానించాడు. చాలా కాలం క్రితమే తన క్లబ్‌ నుంచి ఎప్‌స్టీన్‌ను బయటకు పంపించానని చెప్పాడు. ఈ ఫైళ్లు బయటకు వస్తే డెమోక్రాట్ల నేతల అసలు రూపం బయటపడుతుందని కూడా వ్యాఖ్యానించాడు.

వివరాలు 

ఎప్‌స్టీన్‌పై ఉన్న ఆరోపణలు ఇవి: 

అతనిపై దాఖలైన పత్రాల్లో అమెరికాలోని పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 2002-2005 మధ్య ఫ్లోరిడాలోని తన నివాసానికి మహిళలను,బాలికలను డబ్బు ఎర వేసి తెప్పించి లైంగిక దోపిడీ జరిపినట్లు కేసుల్లో ఆరోపించబడింది. 2019లో జైలులో ఉన్నపుడు, శిక్ష అనుభవిస్తున్న ఒక నెల తర్వాత ఎప్‌స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కోర్టులు విడుదల చేసిన పాక్షిక పత్రాల్లో 90 మంది ప్రముఖుల పేర్లు బయట పడ్డాయి. వీరిలో హార్వర్డ్ మాజీ న్యాయ ప్రొఫెసర్ అలాన్ డెర్షోవిట్జ్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి అనేక ప్రముఖులు ఉన్నారు. ఆ డాక్యుమెంట్లలో డజన్ల కొద్దీ బాలికలు ఎప్‌స్టీన్ మరియు అతని సహచరుల వల్ల ఎదుర్కొన్న లైంగిక వేధింపుల వివరాలు ఉన్నాయి.

వివరాలు 

బిల్ క్లింటన్ పెద్ద వయసు మహిళలను ఇష్టపడతారు 

జోహన్నా సోబర్గ్ అనే మహిళ వాంగ్మూలంలో.. తాను 20 ఏళ్ల వయసులో ఎప్‌స్టీన్‌కు మసాజ్ థెరపిస్ట్‌గా పనిచేసినప్పుడు, అనేకసార్లు దుస్తులు లేకుండా సేవలు అందించాల్సి వచ్చేదని, కొన్ని సందర్భాల్లో నేరుగా లైంగిక చర్యల్లోకి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. బిల్ క్లింటన్ పెద్ద వయసు మహిళలను ఇష్టపడతారని ఎప్‌స్టీన్ తనతో మాట్లాడిన సందర్భాన్ని కూడా జోహన్నా వెల్లడించింది.

వివరాలు 

17 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రిన్స్ ఆండ్రూ

మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వంటి దాదాపు 200 మంది ప్రముఖులు ఎప్‌స్టీన్‌తో ఏదో రూపంలో అనుబంధం కలిగి ఉన్నట్లు పత్రాల్లో కనిపిస్తోంది. క్లింటన్‌పై నేరప్రతిపాదనలు రుజువు కాకపోయినా, ప్రిన్స్ ఆండ్రూ ఒకసారి 17 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలు మాత్రం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వివాదాల నేపథ్యంలోనే రాజు చార్లెస్ అతన్ని రాజ కుటుంబ కార్యకలాపాల నుంచి తప్పించారు.