LOADING...
Epstein Files: అమెరికాలో సంచలనం.. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల, క్లింటన్-జాక్సన్ ఫొటోలు వైరల్!
అమెరికాలో సంచలనం.. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల, క్లింటన్-జాక్సన్ ఫొటోలు వైరల్!

Epstein Files: అమెరికాలో సంచలనం.. ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల, క్లింటన్-జాక్సన్ ఫొటోలు వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

లైంగిక నేరస్థుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైల్స్ చివరకు బహిర్గతమయ్యాయి. ఎప్‌స్టీన్‌పై జరిగిన దర్యాప్తుకు సంబంధించి వేల పేజీల పత్రాలను అమెరికా న్యాయ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఎప్‌స్టీన్ దర్యాప్తు రికార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేస్తూ సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తాజా విడుదల జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్‌ బ్లాంచే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పత్రాలు లక్షల సంఖ్యలో ఉన్నాయని, ప్రస్తుతం కొద్దిమాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. రాబోయే వారాల్లో మరిన్ని కీలక పత్రాలు, వివరాలు వెలుగులోకి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Details

పాప్‌ స్టార్‌ మైఖేల్‌ జాక్సన్‌ కనిపించడం గమనార్హం

తాజాగా విడుదలైన ఫొటోలు రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.వీటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, దివంగత పాప్‌ స్టార్‌ మైఖేల్‌ జాక్సన్‌ కనిపించడం గమనార్హం. బిల్‌ క్లింటన్‌ ఒక గుర్తుతెలియని మహిళతో జలకాలాటలు ఆడుతున్నట్లు కొన్ని చిత్రాల్లో కనిపించారు.మరో ఫొటోలో ఆయన జాకుజీలో గుర్తుతెలియని మహిళతో కలిసి ఉన్నట్లు దర్శనమిస్తోంది. అయితే ఈ చిత్రాలు ఎప్పుడు, ఎక్కడ తీశారన్న వివరాలు పత్రాల్లో పేర్కొనలేదు. అలాగే ఈ ఫొటోల ద్వారా బిల్‌ క్లింటన్‌ ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఎక్కడా స్పష్టంగా వెల్లడించలేదు. విడుదలైన చిత్రాల్లో ఎక్కువగా బిల్‌ క్లింటన్‌కు సంబంధించిన ఫొటోలే ఉండటం గమనార్హం. అయితే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన చిత్రాలు మాత్రం ఈ విడుదలలో కనిపించలేదు.

Details

ఈ చిత్రాల్లో పలువురి ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి

ఇక మైఖేల్‌ జాక్సన్‌ కూడా అనేక చిత్రాల్లో కనిపించగా, రోలింగ్‌ స్టోన్స్‌ ఫ్రంట్‌మ్యాన్‌ మిక్‌ జాగర్‌ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి ఎప్‌స్టీన్ ఉన్న ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరో ఫొటోలో ట్రంప్ సంతకం చేసిన ఒక చెక్ కనిపించింది. ఇది ఎప్‌స్టీన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించిన ఆల్బమ్‌లో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చెక్ చిత్రంపై వైట్‌హౌస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అలాగే విడుదలైన పత్రాల్లో నగ్నంగా లేదా తక్కువ దుస్తులు ధరించిన చిత్రాలు, అలాగే గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో పోజులిచ్చిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాల్లో పలువురి ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Details

ఫొటోలపై వైట్‌హౌస్‌ బహిరంగంగా స్పందన

బిల్‌ క్లింటన్‌కు సంబంధించిన ఫొటోలపై వైట్‌హౌస్‌ బహిరంగంగా స్పందించింది. 'ఈ చిత్రాల్లో బిల్‌ క్లింటన్‌ ప్రపంచంలో ఎలాంటి చింతలూ లేకుండా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని వైట్‌హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ చియుంగ్ ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్ కూడా బిల్‌ క్లింటన్‌ ఉన్న ఫొటోలను ఎక్స్‌లో రీపోస్ట్ చేస్తూ ''అయ్యో!!'' అంటూ స్పందించారు. లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సమయంలో జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019 ఆగస్టులో మాన్‌హట్టన్‌లోని ఒక ఫెడరల్‌ జైలులో మృతిగా కనిపించాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే.

Advertisement