Serbia: సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం.. 14 ఏళ్ల వూచిక్ పాలనకు ముగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
సెర్బియాలో విద్యార్థుల నాయకత్వంలో సాగిన ఉద్యమం పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దీంతో అలెగ్జాండర్ వూచిక్ నేతృత్వంలోని సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ 14 ఏళ్ల పాలనకు తెరపడింది. 2024లో నోవి సాద్ రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ప్రమాదానికి అవినీతి, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో విద్యార్థుల ఉద్యమం కీలక విజయాన్ని అందుకుంది.
వివరాలు
65 శాతం పోలింగ్
ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా సుమారు 65 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ ముగిసిన రెండు గంటల్లోనే అధ్యక్షుడు అలెగ్జాండర్ వూచిక్ తన ఓటమిని అంగీకరించారు.
దీంతో సెర్బియాలోని పలు నగరాల్లో విద్యార్థులు, ప్రజలు వీధుల్లోకి వచ్చి విజయోత్సవాలు జరుపుకున్నారు.
ఈ విజయం తమకు కొత్త ఆశలు కల్పించిందని, ఇప్పుడు స్వేచ్ఛాయుతమైన దేశంలో జీవిస్తున్నామనే భావన కలుగుతోందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
విద్యార్థుల తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది విద్యావేత్తలు,కళాకారులు, ఇతర రంగాలకు చెందిన నిపుణులే ఉన్నారు.
వివరాలు
ఎన్నికల ఫలితాలు సెర్బియా భవిష్యత్ రాజకీయ దిశపై ప్రభావం
వీరికి రాజకీయ అనుభవం పెద్దగా లేకపోయినా, అవినీతిని అరికట్టడం, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం ప్రధాన లక్ష్యాలుగా ప్రచారం చేశారు.
ప్రజల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతిపై ఆగ్రహం విద్యార్థుల ఉద్యమానికి బలంగా మారాయి.
ఈ నేపథ్యంలో వారు సాధించిన విజయం సెర్బియా రాజకీయాల్లో కీలక పరిణామంగా నిలిచింది.
విద్యార్థుల విజయంపై యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, హంగేరీ ప్రధాని పీటర్ మాగ్యార్ అభినందనలు తెలిపారు.
చట్టబద్ధమైన పాలనను బలోపేతం చేయడం, అవినీతిని నిర్మూలించడం వంటి అంశాల్లో విద్యార్థులకు మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఎన్నికల ఫలితాలు సెర్బియా భవిష్యత్ రాజకీయ దిశపై ప్రభావం చూపనున్నాయి.