South Africa: దక్షిణాఫ్రికాలో వరుస కాల్పులు.. జొహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్‌లో 27 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా (South Africa)లో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జొహన్నెస్‌బర్గ్ (Johannesburg), కేప్‌టౌన్ (Cape Town) నగరాల సమీపంలోని టౌన్‌షిప్‌లలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం 27 మంది మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనల్లో మరో 26 మంది గాయపడినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జొహన్నెస్‌బర్గ్‌లోని వెడెలా టౌన్‌షిప్‌లో ఓ బార్‌లో శనివారం రాత్రి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఏకే 47 రైఫిళ్లు, పిస్టళ్లతో వచ్చిన ఎనిమిది మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఇదే సమయంలో కేప్‌టౌన్ సమీపంలోని ల్వాండ్లేలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
వివరాలు
గతంలో డర్బన్ సమీపంలో కాల్పులు
ఆదివారం తెల్లవారుజామున ఓ దుకాణంలోకి చొరబడిన దుండగులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. కాగా.. ఈ రెండు ఘటనలకు కొద్ది రోజుల ముందే డర్బన్ సమీపంలోనూ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీలో ముగ్గురు దుండగులు కాల్పులు జరపగా.. గర్భిణితో సహా 11 మంది మృతిచెందారు. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ కాల్పుల ఘటనలతో దక్షిణాఫ్రికాలోని ఆయా ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఆయా ఘటనలకు సంబంధించి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం.
వరుస కాల్పులతో టౌన్‌షిప్‌లలో నివసిస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.