H1B visa: హెచ్-1బీ వీసా అభ్యర్థులకు షాక్.. ఈ ఏడాది రెండో లాటరీకి నో ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) కీలక అప్డేట్ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన మొత్తం 85 వేల హెచ్-1బీ వీసా స్లాట్లకు అవసరమైన సంఖ్యలో పిటిషన్లు అందినట్లు యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. లాటరీలో ఎంపికైన అభ్యర్థుల తరఫున పూర్తి స్థాయి పిటిషన్లు దాఖలు చేయడానికి సంస్థలకు జూన్ 30, 2026 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియడంతో ఈ ఆర్థిక సంవత్సరానికి రెండోసారి హెచ్-1బీ లాటరీ నిర్వహించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
వివరాలు
85 వేల వీసాలు.. 2.11 లక్షల రిజిస్ట్రేషన్లు
అమెరికా కంపెనీలు విదేశీ నైపుణ్య నిపుణులను నియమించుకునేందుకు ప్రతేడాది 85 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తాయి.
ఇందులో 65 వేల వీసాలు రెగ్యులర్ క్యాప్ కింద, మరో 20 వేల వీసాలు మాస్టర్స్ క్యాప్ కింద కేటాయిస్తారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.11 లక్షల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు వచ్చాయని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.
గతేడాది ఈ సంఖ్య 3.43 లక్షలు ఉండగా, ఈసారి 38.5 శాతం తగ్గినట్లు పేర్కొంది.
ఈసారి ఎంపికైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 1 నుంచి అమెరికాలో హెచ్-1బీ వీసా కింద ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత పొందుతారు.
వివరాలు
కొత్త విధానంలో ఎంపికకు ప్రాధాన్యం
హెచ్-1బీ వీసాల ఎంపిక ఇప్పటివరకు లాటరీ పద్ధతిలో యాదృచ్ఛికంగా జరుగుతుండేది. అయితే ఈసారి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఎంపిక విధానంలో కొన్ని కీలక మార్పులు చేసింది.
కొత్త విధానం ప్రకారం అత్యధిక వేతనాలు పొందే, ఉన్నత నైపుణ్యాలు కలిగిన (లెవల్-4) ఉద్యోగులకు హెచ్-1బీ వీసా పొందే అవకాశాలు ఎక్కువగా ఉండేలా మార్పులు చేశారు.
మరోవైపు తక్కువ వేతనం లేదా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలకు చెందిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రాధాన్యం లభించనుంది.
ఎంపికైన అభ్యర్థుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది.