Israel: ఇజ్రాయెల్‌లో సైనికుల సెలవులు రద్దు.. ఇరాన్‌పై మళ్లీ దాడులకేనా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్‌లో సైనికులకు మంజూరైన అన్ని సెలవులను ఆ దేశ ఆర్మీ రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సెలవుల్లో ఉన్న సైనికులు కూడా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపాయి. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులు చేపట్టేందుకు సిద్ధమవుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై గతంలో తొలిసారి దాడులు ప్రారంభించడానికి కొన్ని గంటల ముందూ ఇజ్రాయెల్ సైనికుల సెలవులను రద్దు చేసి.. వారిని వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆదేశాలు జారీ కావడంతో.. భారీ స్థాయిలో సైనిక చర్యకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
వివరాలు
ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి
మరోవైపు.. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది.
రక్షణ వ్యవస్థల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో దాడులను నిలిపివేయాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం యుద్ధాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నారని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అమెరికా సాయం లేకుండానే టెహ్రాన్‌పై దాడులు నిర్వహించేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇరాన్‌లోని కీలక నేతలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించేందుకు నెతన్యాహు ఇప్పటికే సైనికాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
దాడులు చేస్తే ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
ఇజ్రాయెల్ మరోసారి తమపై దాడులకు పాల్పడితే తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శనివారం హెచ్చరించింది.
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలోని చమురు రిఫైనరీలు, కీలక ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది.
అంతేకాకుండా వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ ప్రాంతం నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ఇరాన్ సూచించింది.
ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని డిమాండ్ చేసింది. అలాగే ఇజ్రాయెల్ దాడుల కారణంగా తమ దేశానికి జరిగిన నష్టానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని కోరింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.