BRICS Summit: బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికా సన్నాహాలు; పుతిన్ గైర్హాజరు
2023 ఏడాదికి గానూ బ్రిక్స్ దేశాల 15వ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోంది. సదస్సు నిర్వహణకు సంబంధించిన సన్నాహాలను తాము చేస్తున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా బుధవారం ప్రకటించారు. ఈ సమ్మిట్‌కు బ్రెజిల్, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాధినేతలు హాజరవుతారని దక్షిణాఫ్రికా పేర్కొంది. అయితే ఈసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశానికి హాజరుకావడం లేదని ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రష్యాకు ప్రాతినిధ్యం వహిస్తారని దక్షిణాఫ్రికా తెలిపింది. కరోనా తర్వాత ప్రత్యక్షంగా జరుగుతున్న తొలి బ్రిక్స్ సదస్సు ఇదే. ఈ సదస్సు విజయవంతమవుతుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్ట్ 22,23,24 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
పుతిన్ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన దక్షిణాఫ్రికాలోని ప్రతిపక్షాలు
వాస్తవానికి బ్రిక్స్ సదస్సుకు రావాల్సిందిగా పుతిన్‌కు దక్షిణాఫ్రికా ఆహ్వానం పంపింది. అయితే దక్షిణాఫ్రికాలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ అలయన్స్ పుతిన్ రాకను తీవ్రంగా వ్యతిరేకించింది. పుతిన్ వస్తే అతనిని అరెస్టు చేయాలని ప్రతిపక్ష నేతలు కోర్టుకు వెళ్లారు. యుద్ధ నేరాల కింద ఇప్పటికే పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. పుతిన్ రష్యా గడ్డను విడిచిపెట్టినట్లయితే అతన్ని అరెస్టు చేసేందుకు ఐసీసీ ఎదురుచూస్తోంది. ఐసీసీ పరిధిలో ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. పుతిన్‌ను అరెస్టు చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటన అవుతుందని దక్షిణాఫ్రికా భావించింది. ఈ క్రమంలో తమ దేశానికి రావొద్దని పుతిన్‌ను కోరింది. దీంతో పుతిన్ సదస్సుకు హాజరవడం లేదు.