
Southkorea: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాలో తీవ్రంగా కార్చిచ్చు వ్యాపిస్తోంది. ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానిక అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతేకాకుండా, శతాబ్ధాల నాటి ప్రాచీన బౌద్ధ దేవాలయం కూడా మంటల్లో కాలిపోయింది.
ఇంటీరియర్ సేఫ్టీ మినిస్ట్రీ ఈ పరిస్థితిపై నివేదిక విడుదల చేసింది. అందులో తెలిపిన ప్రకారం, పొడి గాలులు కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.
దీని ప్రభావంగా మంటలను నియంత్రించడంలో అధికారులు కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటివరకు 19 మంది మరణించగా,మరో 19 మంది గాయపడ్డారు.అలాగే, మంటలను ఆర్పే ప్రయత్నంలో ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో పైలెట్ ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు 10,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది
ఈ అగ్ని ప్రమాదం ఉయిసాంగ్ కౌంటీలో తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో 1,300 సంవత్సరాల పురాతన గౌన్సా దేవాలయం పూర్తిగా నాశనమైంది.
అయితే, ఆలయంలోని విలువైన కళాఖండాలు, విగ్రహాలను ముందుగానే ఇతర దేవాలయాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు 10,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.
బుధవారం నాటికి దాదాపు 43,000 ఎకరాల భూమి అగ్నికి ఆహుతైంది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకు 68 శాతం మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.
అయితే, ఉత్తర, దక్షిణ జియోంగ్‌సాంగ్ ప్రాంతాలతో పాటు ఉల్సాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మంటలు ఇంకా వ్యాపిస్తున్నాయి.
వివరాలు
తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్- సూ స్పందన
ఈ ఘటనపై దక్షిణ కొరియా ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్-సూ తీవ్రంగా స్పందించారు.
"ఇది చాలా ఘోరమైన ప్రమాదం. ఈ మంటల కారణంగా అపూర్వమైన నష్టం సంభవించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మేము ప్రత్యేక దృష్టి పెట్టాం. అవి మరింత విస్తరించకుండా ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.