
Southkorea: దక్షిణ కొరియా అధ్యక్షుడు అభిశంసనను సమర్థించిన కోర్టు.. పదవి నుంచి తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసనను ఏకగ్రీవంగా సమర్థిస్తూ తీర్పును వెలువరించింది.
దీని కారణంగా , 60 రోజుల్లోపు కొత్త అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది.
కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత యూన్ అనుకూలవాదులు నిరాశలో మునిగితే, ఆయన వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేశారు.
తీర్పు కోసం ఎదురుచూస్తున్న యూన్ మద్దతుదారులు, వ్యతిరేకులు వీధుల్లోకి రావడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
పార్లమెంట్‌లో అభిశంసన ఎదుర్కొని అధ్యక్ష పదవి కోల్పోయిన యూన్, రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కోసం వేచి ఉన్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆయనకు ప్రతికూలంగా వచ్చింది.
వివరాలు
ప్రజల అంచనాలను అందుకోలేకపోయాను, క్షమించండి
తీర్పు వెలువరించిన అనంతరం యూన్ స్పందిస్తూ, ప్రజల అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమాపణలు కోరారు.
''దక్షిణ కొరియాకు సేవ చేయడం నాకు అత్యంత గౌరవం. నా పాలనలో లోపాలు ఉండొచ్చు, అయినా నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల అంచనాలను అందుకోలేకపోవడం బాధ కలిగించింది. నా తప్పులను క్షమించండి. మన దేశం, ప్రజల శ్రేయస్సు కోసం నేను ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటాను'' అని యూన్ తరఫున లాయర్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
జూన్ 3న ఎన్నికలు?
యూన్ అభిశంసనకు రాజ్యాంగ ధర్మాసనం మద్దతు తెలపడంతో దక్షిణ కొరియాలో త్వరలోనే కొత్త అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
60 రోజుల గడువు చివరి తేదీ జూన్ 3 కావడంతో, ఆ రోజున ఎన్నికలు జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తం కావడానికి తగినంత సమయం అవసరం అని, అందుకు సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ హన్నా కిమ్, ప్రముఖ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్యున్ 2017 మార్చి 10న పదవి నుంచి తొలగించబడ్డారు. 60 రోజులకు, అంటే మే 9న కొత్త అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.
వివరాలు
అసలేం జరిగిందంటే?
గత్ సంవత్సరం డిసెంబర్ 3 అర్ధరాత్రి,దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్, దేశాన్ని ఉత్తర కొరియా కమ్యూనిస్టు దళాల నుంచి రక్షించేందుకు దేశవ్యాప్తంగా మార్షల్ లా విధిస్తున్నట్లు ప్రకటించారు.
దేశ వ్యతిరేక శక్తులను అదుపు చేయడం కోసం ఈ నిర్ణయం తప్పనిసరి అని ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
అయితే, కొన్ని గంటల్లోనే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, ఎమర్జెన్సీని ఎత్తివేశారు.
జాతీయ అసెంబ్లీ నుండి వచ్చిన ఒత్తిడితో మార్షల్ లాను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
దీంతో, అధ్యక్షుడిపై తిరుగుబాటు ప్రయత్నం చేశారనే ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభమైంది.
విచారణకు సహకరించడానికి నిరాకరించిన యూన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేశారు.
వివరాలు
అరెస్టు ప్రక్రియ ఆలస్యం
జనవరి 3న యూన్‌ను అరెస్ట్ చేసేందుకు అధికార బృందం వెళ్లింది.కానీ, ఆయన మద్దతుదారులు ఇనుప కంచెలు, బస్సులతో అడ్డుకోవడంతో అరెస్టు ప్రక్రియ కొంత ఆలస్యమైంది.
జనవరి 15న మరోసారి అధికారులు బలవంతంగా ఆయన నివాసానికి ప్రవేశించి, చివరికి యూన్‌ను అరెస్ట్ చేశారు.
దక్షిణ కొరియాలో అరెస్ట్ అయిన తొలి ప్రస్తుత అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ చరిత్రలో నిలిచిపోయారు.
వివరాలు
పాలనలో గందరగోళం
యూన్ పదవి కోల్పోయిన తర్వాత, తాత్కాలిక అధ్యక్షుడిగా హాన్ డక్ సూ బాధ్యతలు స్వీకరించారు.
అయితే, ఆయన కూడా అభిశంసనకు గురయ్యారు. దీంతో ఆర్థిక మంత్రి చోయ్ సంగ్ మాక్ తాత్కాలిక అధ్యక్షునిగా నియమితులయ్యారు.
ఈ రాజకీయ అస్థిరత దక్షిణ కొరియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. యూన్ మద్దతుదారులు, వ్యతిరేకులుగా ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు.