LOADING...
Spider-Man of Yemen: 120 మీటర్ల అగ్నిపర్వత బిలంలో పడి 'స్పైడర్‌ మ్యాన్‌ ఆఫ్‌ యెమెన్‌' మృతి
120 మీటర్ల అగ్నిపర్వత బిలంలో పడి 'స్పైడర్‌ మ్యాన్‌ ఆఫ్‌ యెమెన్‌' మృతి

Spider-Man of Yemen: 120 మీటర్ల అగ్నిపర్వత బిలంలో పడి 'స్పైడర్‌ మ్యాన్‌ ఆఫ్‌ యెమెన్‌' మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

'స్పైడర్ మ్యాన్ ఆఫ్ యెమెన్'గా గుర్తింపు పొందిన అల్‌-ఖాఖా బిన్‌ అంతర్‌ (30) ప్రమాదవశాత్తు అగ్నిపర్వత బిలంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా ప్రమాదకరంగా అగ్నిపర్వత గోడలను అధిరోహించే ప్రయత్నంలో ఈ విషాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. దక్షిణ యెమెన్‌లోని ధాలే ప్రావిన్స్ పరిధిలో ఉన్న హర్దా డ్యాం అగ్నిపర్వత బిలం వద్ద ఈ ఘటన జరిగింది. శుక్రవారం నాడు బిన్‌ అంతర్‌ ఆ బిలానికి ఆనుకుని ఉన్న నిటారుగా ఉన్న రాతిగోడలను ఎక్కుతుండగా అకస్మాత్తుగా పట్టు కోల్పోయి లోయలో పడిపోయాడు.

వివరాలు

30 మీటర్ల లోతులో బిన్‌ అంతర్‌ మృతదేహాన్ని

ఈ ప్రమాదానికి సంబంధించిన 10 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఎలాంటి తాళ్లు, రక్షణ పరికరాలు లేకుండా బిన్‌ అంతర్‌ రాతికొండను ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక దశలో కుడి చేత్తో మాత్రమే రాతిని పట్టుకుని, ఎడమ చేతిని గాల్లోకి ఎత్తిన సమయంలో అతను సమతుల్యత కోల్పోయి అగ్నిపర్వత బిలంలోకి జారిపడిన దృశ్యాలు నమోదయ్యాయి. అధికారుల అంచనా ప్రకారం ఈ అగ్నిపర్వత బిలం సుమారు 120 మీటర్ల లోతు కలిగి ఉంది. ప్రమాదం అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో నీటి ఉపరితలం నుంచి సుమారు 30 మీటర్ల లోతులో బిన్‌ అంతర్‌ మృతదేహాన్ని గుర్తించారు.

వివరాలు

సోషల్ మీడియాలో విపరీతమైన గుర్తింపు

నాలుగు గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఆయన మృతదేహాన్ని వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. అల్‌-ఖాఖా బిన్‌ అంతర్‌ యెమెన్‌లోని అత్యంత ప్రమాదకరమైన కొండచరియలు, పర్వత శిఖరాలు, అగ్నిపర్వత ప్రాంతాలను ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా అధిరోహిస్తూ వీడియోలు చిత్రీకరించేవాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతనికి విపరీతమైన గుర్తింపు లభించింది. ఈ సాహసాల కారణంగానే అతను 'స్పైడర్ మ్యాన్ ఆఫ్ యెమెన్'గా ప్రసిద్ధి చెందాడు. అయితే అదే సాహసం చివరకు అతని ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన యెమెన్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Advertisement