Sri Lanka: శ్రీలంకలో వారానికి నాలుగే పనిదినాలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా లోపాలు తీవ్రంగా మారాయి. ఈ సంక్షోభం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుండగా, శ్రీలంక కూడా తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పనిదినాలను తగ్గిస్తూ వారానికి మూడు రోజుల సెలవులను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న శని, ఆదివారాల సెలవులకు తోడు బుధవారం రోజును కూడా తప్పనిసరి ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది. దీంతో అక్కడి ఉద్యోగులు ఇకపై వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు
ఈ నెల 18వ తేదీ నుంచి అమల్లోకి..
ఈ నిర్ణయం ఈ నెల 18వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని నిత్యావసర సేవల కమిషనర్ జనరల్ ప్రభాత్ చంద్రకీర్తి వెల్లడించారు. అయితే ఆరోగ్య సేవలు, పోర్టులు (రేవులు), నీటి సరఫరా, కస్టమ్స్ వంటి కీలక విభాగాలకు ఈ నియమం వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా, ఈ నిబంధనలు ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగ సంస్థలకూ వర్తిస్తాయని అధికారులు తెలిపారు.