Libya floods: శవాల దిబ్బగా లిబియాలో డెర్నా నగరం.. 'డేనియల్' తుపాను ధాటికి 5,300పైగా మృతి
లిబియాలో 'డేనియల్' తుపాను విలయతాండవం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా డెర్నా నగరంలో మరణ మృదంగం మోగుతోంది. వర్షాలతో సంభవించిన వరదల ధాటికి డెర్నా నగరంలో మరణించిన వారి సంఖ్య 5,300 దాటింది. 10,000 మందికి పైగా గల్లంతయ్యారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. తూర్పు లిబియాయాలో శిథిలాల నుంచి తాజాగా 1,000పైగా మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య వేలల్లో పెరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (ఐఎఫ్‌ఆర్‌సీ) లిబియా రాయబారి తెలిపారు. ఇదిలా ఉంటే, వరదల వల్ల బాధితులకు సహాయం చేస్తూ ముగ్గురు ఐఎఫ్‌ఆర్‌సీ వాలంటీర్లు మృత్యువాత పడ్డారు.
కొట్టుకుపోయిన భవనాలు, కనడనని రోడ్లు
'డేనియల్' తుఫాను డెర్నా నగరాన్ని శిథిలమయం చేసింది. 125,000 మంది జనాభా ఈ నగరంలోని అనేక ఇళ్లు, భవనాలను వరదలు నెలమట్టం చేశాయి. రోడ్లు, డ్యామ్‌లు, కార్లు కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ రాళ్లతో నిండిపోయాయి. ఆస్పత్రుల కారిడార్‌ల అన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. మృత దేహాలను గుర్తు పట్టేందుకు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి క్యూ కట్టారు. లిబియా మానవతా సాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఐక్యరాజ్యసమితి కార్యాలయం పంపింది. టర్కీతో పాటు ఇతర దేశాలు రెస్క్యూ వాహనాలు, రెస్క్యూ బోట్లు, జనరేటర్లు, ఆహారం అందించేందుకు ముందుకొచ్చాయి.