
Air Canada: సమ్మెతో అంతర్జాతీయ ప్రయాణాలకు అంతరాయం.. నిలిచిపోయిన 700 ఎయిర్ కెనడా విమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ కెనడా (Air Canada)లో ఫ్లైట్ అటెండెంట్ల సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన నేపథ్యంలో ఎయిర్ కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె నోటీసు గడువు నేటితో ముగియడంతో.. ఎయిర్ కెనడా, అలాగే దాని అనుబంధ సంస్థ ఎయిర్ కెనడా రూజ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే థర్డ్ పార్టీ నిర్వహిస్తున్న ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం కారణంగా రోజుకు సగటున 1.3 లక్షల మంది ప్రయాణికులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. కెనడాలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఎయిర్ కెనడా నిత్యం దాదాపు 700 సర్వీసులు నడుపుతోంది.
Details
వేతనాలను పెంచాలి
వీటిలో 10 వేల మంది ఫ్లైట్ అటెండెంట్లు పనిచేస్తున్నారు. ప్రయాణ సమయంలో భద్రత, సౌకర్యాలకు వీరే బాధ్యత వహిస్తారు. అయితే, వేతనాల పెంపు కోసం కెనడియన్ యూనియన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయిస్ (CUPE) ఆగస్టు 13న మూడు రోజుల సమ్మె నోటీసు ఇచ్చింది. ఆ గడువు నేటితో ముగియగా.. చర్చలు విఫలమవడంతో సమ్మె ప్రారంభమైంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఎయిర్ కెనడా విమానాలు నిలిచిపోయాయి. ఇక సమ్మె కారణంగా సర్వీసులను క్రమంగా తగ్గిస్తున్నామని, శనివారానికి పూర్తిగా నిలిపివేయనున్నట్లు ముందుగానే ప్రకటించిన ఎయిర్ కెనడా.. ఈ రోజు నుంచే అన్ని సర్వీసులను నిలిపివేసింది.
Details
విదేశీ ప్రయాణాలపై ప్రభావం
విదేశీ ప్రయాణాలపై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపనుందని అంచనా. అయితే రద్దైన విమానాల్లో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు పూర్తి రుసుము వాపసు చేస్తామన్నారు. ఇతర విమాన సంస్థలతో చర్చించి వీలైనంత వరకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంస్థ అధికారులు వెల్లడించారు.