ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం సంభవించిన వరుస భూకంపాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఈ విపత్తులో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2,000 దాటినట్లు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి బిలాల్ కరీమీ తెలిపారు. దురదృష్టవశాత్తూ ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉందని బిలాల్ కరీమీ వెల్లడించారు. హెరాత్ ప్రావిన్స్‌లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత వరుసగా నాలుగు ప్రకంపనలు వచ్చాయి. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు, మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. జిందా జాన్ జిల్లాలోని సర్బోలాండ్ గ్రామంలో భూకంపం ధాటికి డజన్ల కొద్దీ గృహాలు ధ్వంసమయ్యాయి.
ఇళ్లన్నీ నేలమట్టం
హెరాత్ ప్రావిన్స్‌లోని కనీసం 12 గ్రామాలలో 600 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయని 4,200 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 42 ఏళ్ల బషీర్ అహ్మద్ మాట్లాడుతూ.. మొదటిసారి వచ్చిన భూకంపంలోనే అన్ని ఇళ్ళు కూలిపోయాయని చెప్పారు. ఈ క్రమంలో చాలా మంది ఇళ్ల శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 11:00 గంటలకు మొదటి భూకంపం సంభవించినప్పుడు తాను పనిలో ఉన్నానని నెక్ మొహమ్మద్ తెలిపారు. కొద్ది సేపటికి ఇంటి వచ్చి చూడగా, ఏమీ మిగిలి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతా ఇసుకగా మారిందన్నారు. ఈ ఒక్క ప్రాంతంలోనే 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.