Donald Trump: విమాన మెట్లపై తడబాటు.. ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ప్రశ్నలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు కాస్త తడబడుతూ నడవడం ఇందుకు కారణమైంది. శనివారం ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్న సందర్భంగా విమానం మెట్లపై రైలింగ్ పట్టుకుని జాగ్రత్తగా దిగుతూ కనిపించారు. మధ్యలో ఆగుతూ, కొద్దిగా తడబడుతూ నడుస్తున్న ఆయన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో దీనికి ముందు రోజు జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించిన మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.
వివరాలు
గతంలో ట్రంప్ ఆరోగ్యంపై చర్చలు
అందులో ట్రంప్ కుర్చీలో కూర్చోవడానికి ఇబ్బంది పడినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఈ వీడియోలపై కొందరు నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇది సాధారణ విషయం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. గతంలో కూడా ట్రంప్ ఆరోగ్యంపై ఇలాంటి చర్చలు వెలువడిన సందర్భాలు ఉన్నాయి. అయితే వైట్ హౌస్ వాటిని తరచుగా ఖండిస్తూ వస్తోంది. ట్రంప్ కూడా తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని పలుమార్లు స్పష్టం చేశారు.