Page Loader
Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి
పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి

Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రవాదం తన అమానవీయ రూపాన్ని ప్రదర్శించింది. కుజ్దార్ జిల్లాలో బుధవారం రోజు జరిగిన ఓ భారీ బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది 'ఆత్మాహుతి దాడిగా' భావిస్తున్నారు. ఈ దారుణ దాడి ఒక పాఠశాల బస్సును లక్ష్యంగా చేసుకుని జరిగింది. బస్సులో విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, 38 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Details

బిఎల్‌ఎపై అనుమానాలు 

ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే, పాకిస్తాన్ భద్రతా సంస్థలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)పై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా ఈ ఉగ్ర సంస్థ అనేకసార్లు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌లు, సివిలియన్ లక్ష్యాలను దాడి చేసిన రికార్డు ఉంది.

Details

కఠిన చర్యలు తప్పవు : కేంద్ర హోంశాఖ మంత్రి 

ఈ దారుణ ఘటనపై పాకిస్తాన్ కేంద్ర హోంశాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా స్పందించారు. ఇది అమాయక పిల్లలపై జరిగిన అమానుష దాడి, దీనిని మానవత్వాన్ని మరిచిన హింసాత్మక చర్యగా పరిగణిస్తున్నాం. దోషులు మానవ రూపంలో మృగాలని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తప్పవని, బాధితులను వదిలిపెట్టమని హెచ్చరించారు.