Pakistan: పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 12 మంది సైనికులు మృతి
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. బన్నూలోని చెక్‌పాయింట్ వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడు ఓ కారును పేల్చివేశాడు. కారును పేల్చిన వెంటనే, అతని సహచరులు కాల్పులకు పాల్పడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడిలో 12 మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు
ఈ దాడికి తమే బాధ్యులమని హఫీజ్ గుల్ బహదూర్ నేతృత్వంలోని సాయుధ బృందం ప్రకటించింది. అదే విధంగా, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) కూడా ఈ దాడి తమదేనని ప్రకటించింది. భద్రతా దళాలు తమ సభ్యులపై చర్యలు చేపట్టినందుకు ప్రతిగా ఈ దాడి నిర్వహించినట్లు వారు తెలిపారు. 2021లో ఆఫ్ఘన్ తాలిబాన్ కాబూల్‌లో అధికారాన్ని తిరిగి పొందిన తర్వాత పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.