Loading...
Bangladesh: తారిక్‌ రెహమాన్‌ భారత్‌ పర్యటనపై సస్పెన్స్‌.. బంగ్లా మంత్రి కీలక వ్యాఖ్యలు!
తారిక్‌ రెహమాన్‌ భారత్‌ పర్యటనపై సస్పెన్స్‌.. బంగ్లా మంత్రి కీలక వ్యాఖ్యలు!

Bangladesh: తారిక్‌ రెహమాన్‌ భారత్‌ పర్యటనపై సస్పెన్స్‌.. బంగ్లా మంత్రి కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ ప్రధాని తారిక్‌ రెహమాన్‌ భారత పర్యటనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తారిక్‌ రెహమాన్‌ భారత పర్యటనకు తొందరపడాల్సిన అవసరం లేదని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో సానుకూల సంబంధాలు కొనసాగించాలని బంగ్లాదేశ్‌ కోరుకుంటోందని, అయితే జాతీయ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల్లో తగిన పురోగతి సాధించిన తర్వాత, సరైన సమయంలో తారిక్‌ రెహమాన్‌ భారత్‌లో పర్యటిస్తారని హుమయూన్‌ తెలిపారు.

వివరాలు

రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇటీవల ప్రకటన

ప్రధాని అధికారిక పర్యటనకు తగిన సన్నాహాలతోపాటు ఇరుపక్షాల మధ్య అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తికావాల్సి ఉందన్నారు.

తారిక్‌ రెహమాన్‌ భారత పర్యటనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బంగ్లాదేశ్‌ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

మాజీ ప్రధాని షేక్‌ హసీనాతోపాటు ఇతర నేరస్థులను అప్పగించే అంశంలో భారత్‌ నుంచి స్పందన కోసం బంగ్లాదేశ్‌ ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

సెప్టెంబర్‌ 12, 13తేదీల్లో దిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సుకు తారిక్‌ రెహమాన్‌ హాజరు కావాల్సి ఉంది. దీనికి ముందే ఆయన దిల్లీకి వస్తారని గతంలో వార్తలు వచ్చాయి.

బంగ్లాదేశ్‌ ప్రధానిని స్వాగతించే కార్యక్రమానికి సంబంధించిన రిహార్సల్స్‌ జరుగుతున్నాయని రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇటీవల ప్రకటన వెలువడింది.

అయితే కొన్ని గంటల్లోనే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవడం గమనార్హం.

వివరాలు

మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్‌?

మరోవైపు పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే కుదుర్చుకున్న 'మక్కా సమష్టి రక్షణ ఒప్పందం'లో చేరే అంశాన్ని బంగ్లాదేశ్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం దేశ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని భావిస్తే.. ఇందులో చేరే అంశాన్ని పరిశీలిస్తామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్‌ తెలిపారు.

పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియేతో రక్షణ సహకారాన్ని పెంచుకునే విషయంలో బంగ్లాదేశ్‌ సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని తారిక్‌ రెహమాన్‌ త్వరలో రియాద్‌ పర్యటించనున్నట్లు వెల్లడించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ కూడా మక్కా ఒప్పందంలో చేరే అవకాశంపై చర్చ మొదలైంది.

ADVERTISEMENT