Sweden: లైంగిక దోపిడీ, 120 మంది విటులు.. స్వీడన్‌ను కుదిపేస్తున్న లైంగిక దోపిడీ కేసు
ఈ వార్తాకథనం ఏంటి
స్వీడన్‌లో ప్రస్తుతం "స్వీడిష్ పెలికాట్ కేసు" పేరుతో సంచలనం రేపుతున్న లైంగిక దోపిడీ ఘటనలో ఒక్కొక్కటిగా భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. మాజీ హెల్స్ ఏంజెల్స్ గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి, ఒక మహిళను కిరాతకంగా శారీరక,మానసికంగా దోపిడీకి గురి చేశాడన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నిందితుడు బాధితురాలి డ్రగ్స్ వ్యసనాన్ని అవకాశంగా మార్చుకుని, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె పేరుతో ఆన్‌లైన్‌లో ప్రకటనలు సృష్టించి, విటులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టాడు. డబ్బు కోసం మాత్రమే కాకుండా, బెదిరింపులు, హింసతో ఆమెను నియంత్రించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనను ప్రాసిక్యూటర్ ఐడా అన్నర్‌స్టెడ్ "అత్యంత నిర్దాక్షిణ్యమైన దోపిడీ"గా అభివర్ణించారు.
వివరాలు
'రాక్షసుడిని బయటకు తీస్తా'..
నిందితుడిపై మొత్తం ఎనిమిది అత్యాచారాలు,నాలుగు అత్యాచార యత్నాలు, అలాగే నాలుగు దాడుల కేసులు నమోదయ్యాయి. బాధితురాలు కొన్ని లైంగిక చర్యలకు స్పష్టమైన హద్దులు విధించినప్పటికీ, ఆమె "వద్దు" అని చెప్పిన సందర్భాల్లో కూడా బలవంతంగా చర్యలకు దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలు 2022 ఆగస్టు నుంచి 2025 అక్టోబర్ మధ్య జరిగినట్లు వెల్లడించారు. ఈ కేసు విచారణలో భాగంగా సుమారు 120 మంది వ్యక్తులు బాధితురాలి నుంచి లైంగిక సేవలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 26 మందిపై కేసులు నమోదు కాగా, మిగతా వారిపై దర్యాప్తు కొనసాగుతోంది. అంతేకాకుండా, నిందితుడు తన భార్యను కూడా బెదిరిస్తూ, తనలోని "రాక్షసుడిని బయటకు తీస్తాను" అంటూ హెచ్చరించినట్లు అభియోగ పత్రాల్లో నమోదు చేశారు.
వివరాలు
ఏప్రిల్ 13 నుంచి కేసు విచారణ
ఈ ఘటనపై స్వీడన్ లింగ సమానత్వ శాఖ మంత్రి నినా లార్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు "షాకింగ్‌గా, అసహ్యకరంగా ఉన్నాయి" అంటూ వ్యాఖ్యానించారు. అయితే, నిందితుడు తనపై ఉన్న అన్ని ఆరోపణలను ఖండిస్తున్నాడు. ఈ కేసు విచారణ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానుంది. స్వీడన్ చట్టాల ప్రకారం, లైంగిక సేవలను విక్రయించడం నేరంగా పరిగణించరు. కానీ వాటిని కొనుగోలు చేయడం లేదా ఇతరులను ప్రోత్సహించడం మాత్రం తీవ్రమైన నేరంగా చట్టం చెబుతోంది.