అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం
ఉత్తర సిరియాపై అమెరికా జరిపిన హెలికాప్టర్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతమయ్యాడు. మధ్యప్రాచ్యం, ఐరోపాలో దాడులకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇస్లామిక్ స్టేట్ సీనియర్ నాయకుడిని అబ్ద్-అల్-హదీ మహమూద్ అల్-హాజీ అలీని చంపినట్లు పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది. మహమూద్ అల్-హాజీ అలీని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని, విదేశాల్లోని అధికారులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ పన్నాగం పన్నుతున్నట్లు నిఘా సమాచారం సేకరించిన తర్వాత ఈ డాడి చేసినట్లు అమెరికా వెల్లడించింది.
దాడిలో మరో ఇద్దరు సాయుధులు మృతి
మధ్యప్రాచ్యం దాటి దాడి చేయాలనే కోరికతో ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్) కార్యకలాపాలను కొనసాగిస్తోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ మైఖేల్ కురిల్లా తెలిపారు. ఈ దాడిలో మరో ఇద్దరు సాయుధ వ్యక్తులు మరణించారని, పౌరులకు ఎటువంటి హాని జరగలేదని పెంటగాన్ పేర్కొంది. ఐరోపా, టర్కీలో దాడులకు ప్రణాళిక చేసిన మరొక సీనియర్ ఇస్లామిక్ స్టేట్ నాయకుడు ఖలీద్ 'అయద్ అహ్మద్ అల్-జబౌరీని రెండు వారాల క్రితం అమెరికా దళాలు హతమార్చాయి.