LOADING...
Mumbai Attacks: శిక్ష నుంచి తప్పించుకునేందుకు మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కిన తహవూర్ రాణా.. భారత్‌పై ఆరోపణలు
భారత్‌పై ఆరోపణలు

Mumbai Attacks: శిక్ష నుంచి తప్పించుకునేందుకు మరోసారి అమెరికా కోర్టు మెట్లెక్కిన తహవూర్ రాణా.. భారత్‌పై ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయి 26/11 ఉగ్రదాడి కేసులో దోషిగా తేలిన తహవూర్‌ రాణా (Tahawwur Rana) తనను భారత్‌కు అప్పగించవద్దని (Extradition) అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. తనను భారత్‌కు అప్పగించకుండా అత్యవసరంగా ఆదేశాలు ఇవ్వాలని యూఎస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. భారత్‌కు పంపితే అక్కడ తనపై చిత్రహింసలు అమలు చేస్తారని ఆయన ఆరోపించాడు. ఈ విషయంపై జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పగింతకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ దాఖలు చేసిన రాణా, భారత్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు.

వివరాలు 

తహవూర్‌ రాణా నేపథ్యం 

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌ మూలాలు కలిగిన కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఆయన లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.రాణాను భారత్‌కు అప్పగించాలని భారత ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే,అతడు ఈ అప్పగింతను సవాల్‌ చేస్తూ పలు ఫెడరల్‌ కోర్టులను ఆశ్రయించాడు. కానీ ఆయా న్యాయస్థానాలు అతని అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్‌లోనూ అతడికి చేదు అనుభవమే ఎదురైంది. దీంతో,తహవూర్‌ రాణా 2023 నవంబర్ 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే, అమెరికా ప్రభుత్వం ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరుతూ 20 పేజీల అఫిడవిట్‌ సమర్పించింది.

వివరాలు 

ట్రంప్‌ ప్రకటన.. అప్పగింత అవకాశం 

ఆ అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు, రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీని ద్వారా అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల, భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, ట్రంప్‌ మాట్లాడుతూ, "26/11 ముంబయి ఉగ్రదాడికి సంబంధించి ఒక ప్రధాన నిందితుడిని భారత్‌కు అప్పగించబోతున్నాం. భవిష్యత్తులో మరిన్ని నేరగాళ్ల విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంటాం" అని ప్రకటించారు. దీంతో తహవూర్‌ రాణాను కొన్ని నెలల్లోనే భారత్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

వివరాలు 

ముంబయి దాడిలో రాణా పాత్ర 

26/11 దాడులకు ముందు, ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. ఈ పనిలో రాణా అతనికి సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం, తహవూర్‌ రాణా ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో, హెడ్లీతో పరిచయం ఏర్పడింది. ముంబయిలో ఉగ్రదాడులకు అవసరమైన ప్రణాళికలు (Blueprints) సిద్ధం చేయడంలో రాణా సహకారం అందించాడు. 26/11 ఉగ్రదాడుల తర్వాత, రాణా, హెడ్లీపై ఉగ్రవాదం మరియు కుట్రలకు సంబంధించి పలు కేసులు నమోదు అయ్యాయి. 2009లో, షికాగోలో ఎఫ్‌బీఐ అధికారులు తహవూర్‌ రాణాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు, అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియకు తుది మజిలి సమీపించింది.