Iran-USA: ఒమన్‌లో చర్చలు.. ఇరాన్‌పై ఆంక్షలు.. ట్రంప్ డ్యూయల్ స్ట్రాటజీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఒమన్ వేదికగా చర్చలు ప్రారంభమైన నేపథ్యంలోనే ఇరాన్ చమురు వ్యాపారంపై అమెరికా కీలక ఆంక్షలు విధించింది. ఇరాన్‌తో ముడిచమురు లావాదేవీలు నిర్వహిస్తున్న 15 సంస్థలు, అలాగే 14 రహస్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ చమురు వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా, అలాగే తమ దేశంలోని పౌరులను అణచివేయడానికి వినియోగిస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. అందుకే ఆ ఆదాయ మార్గాలను అడ్డుకునే ఉద్దేశంతో ఆంక్షలు విధిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.
Details
భవిష్యత్ సంప్రదింపులకు మార్గం సుగమం
ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోకెమికల్ ఉత్పత్తులకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార నెట్‌వర్క్‌పై భవిష్యత్తులోనూ తమ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఒమన్‌లో అమెరికా ప్రతినిధులతో ప్రారంభమైన చర్చలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ 'చాలా మంచి ఆరంభం'గా అభివర్ణించారు. అణు కార్యక్రమానికి సంబంధించిన భవిష్యత్ సంప్రదింపులకు మార్గం సుగమం చేయడంపైనే ప్రాథమికంగా తమ దృష్టి కేంద్రీకృతమైందని తెలిపారు.
Details
ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకునేలా అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ఒకవేళ డీల్ సాధ్యం కాకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఇరాన్‌కు బాగా తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే టెహ్రాన్ ఒప్పందం కోసం ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇరాన్ వైపు తమ నౌకాదళం కదులుతోందని, అది అక్కడికి చేరిన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చూడాలని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదన్న షరతును మరోసారి ట్రంప్ పునరుద్ఘాటించారు.