LOADING...
Gold Card: సంపన్నుల కోసం అమెరికా 'గోల్డ్ కార్డ్' వీసా విధానం.. డిసెంబర్ 18న ప్రారంభించేందుకు ట్రంప్ సర్కారు సన్నాహాలు
డిసెంబర్ 18న ప్రారంభించేందుకు ట్రంప్ సర్కారు సన్నాహాలు

Gold Card: సంపన్నుల కోసం అమెరికా 'గోల్డ్ కార్డ్' వీసా విధానం.. డిసెంబర్ 18న ప్రారంభించేందుకు ట్రంప్ సర్కారు సన్నాహాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో స్థిరపడాలని కోరుకునే అధిక ఆర్థిక సామర్థ్యం ఉన్న విదేశీయుల కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త వీసా విధానాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. భారీ మొత్తంలో ఆర్థిక సహకారం అందించే వారికి శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) ఇవ్వడానికి రూపొందించిన 'గోల్డ్ కార్డ్' పథకాన్ని త్వరలోనే ప్రకటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం అవసరమైన I-140G దరఖాస్తు పత్రం ముసాయిదాను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు సమర్పించింది. అవసరమైన అనుమతులు లభించిన వెంటనే, డిసెంబర్ 18 నాటికే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు 

'గోల్డ్ కార్డ్' అంటే ఏమిటి? 

ఈ పథకం ప్రకారం, అమెరికాకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం కలిగించగలరు అని భావించిన వ్యక్తులకు నేరుగా శాశ్వత నివాస హోదా మంజూరవుతుంది. దరఖాస్తుదారులు తిరిగి రాని ప్రాసెసింగ్ ఫీజు తో పాటు, వీసా ఆమోదం తర్వాత 1 మిలియన్ డాలర్లు (సుమారు ₹8.3 కోట్లు) అమెరికా ప్రభుత్వానికి విరాళంగా సమర్పించాలి. కార్పొరేట్ సంస్థల పేరుతో దరఖాస్తు చేసుకునే వారికి ఈ విరాళం 2 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ప్రాసెసింగ్ ఛార్జీలు $15,000. అదేవిధంగా, 5 మిలియన్ డాలర్ల విరాళంతో వచ్చే 'ప్లాటినం కార్డ్' ఎంపికను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఈ ఆప్షన్ తీసుకునే వారికి విదేశీ ఆదాయంపై పన్ను మినహాయింపు లభించనుంది.

వివరాలు 

EB-5 కు బదులుగా కొత్త పథకం 

ప్రస్తుతం అమల్లో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలోనే 'గోల్డ్ కార్డ్'ను తీసుకువస్తున్నారు. EB-5 విధానం అనవసరంగా నత్తనడకన సాగుతోందని, మోసాలకు అవకాశం ఇస్తోందని విమర్శలు ఉన్నాయి. "ప్రస్తుత EB-5 విధానం ప్రయోజనం లేకుండా, అక్రమాలకు తావిస్తోందని భావించాం. అందుకే అధ్యక్షుడు ట్రంప్ దానికి బదులుగా 'గోల్డ్ కార్డ్' పథకాన్ని రూపొందించారు" అని యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ పేర్కొన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.

వివరాలు 

కఠిన పరిశీలన తర్వాతే వీసా 

దరఖాస్తుదారుల నేర చరిత్ర, ఆర్థిక వ్యవహారాలు, పన్ను వివరాలు, క్రిప్టోకరెన్సీ ఆస్తులు వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే వీసా మంజూరవుతుంది. ఈ కార్యక్రమం ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదని, త్వరలోనే అదనపు వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు.