Tesla : అమెరికాలో రోబో దారుణం.. టెస్లా ఇంజినీర్‌కు తీవ్ర గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో టెస్లా గీగా ఫ్యాక్టరీలో దారుణం జరిగింది. ఓ రోబో దాడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రగాయాల పాలయ్యారు.
గీగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యూపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన నివేదికలో (ఇంజ్యురీ రిపోర్టు) ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
రెండేళ్ల క్రితం ఆస్టిన్‌లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అల్యూమినియం పలకలను కోసి కారు విడిభాగాలను తయారు చేసేందుకు ఈ రోబోలను వినియోగిస్తారు.
రోబోల సాఫ్ట్‌వేర్‌ను ఇంజినీర్ అప్‌డేట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సాధారణంగా ఇటువంటి సమయాల్లో రోబోలను ఇనాక్టివ్ చేస్తారు. కానీ ఘటన జరిగిన రోజు ఓ రోబో ప్రమాదవశాత్తూ యాక్టివ్‌గా ఉంది.
DETAILS
ఇంజనీర్'పై దాడి చేసి గాయపర్చిన రోబో
అప్‌డేట్ సమయంలో అది సదరు ఇంజినీర్‌ను కింద పడేసి, అదిమిపెట్టి బంధించింది. రోబోకున్న పదునైన భాగాలు బాధితుడి వీపులోకి గుచ్చుకున్నాయి. చేతికి సైతం త్రీవ గాయమైంది.
అయితే ఆ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం మినహా 2021, 2022లో ఇతర ప్రమాదాలేవీ జరగలేదు. ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు నివేదికలో తేలింది.
టెక్సాస్‌లోని ఫ్యాక్టరీలో గతేడాది సగటున 21 మంది సిబ్బందిలో ఒకరు గాయాలపాలయ్యారని ఇంజ్యురీ రిపోర్టులో వెల్లడైంది.
ఆటోమొబైల్ రంగంలో సగటు కంటే ఇది అధికం కాగా, కంపెనీలో భద్రతా ఉల్లంఘనలు జరుగుతున్నట్లు గతంలో కొందరు టెస్లా మాజీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్మాణం,నిర్వహణ,ఇతర వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు లేక ఉద్యోగులకు రిస్క్ ఎక్కువవుతోందన్నారు.