Thailand: థాయిలాండ్‌లో భారీ వర్షాలు.. పర్యాటక ప్రాంతం ఫుకెట్‌ను ముంచెత్తిన వరదలు
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దక్షిణ థాయిలాండ్‌లోని ఫుకెట్ ప్రావిన్స్‌లో ఉన్న మూడు జిల్లాలపై ఈ ప్రభావం పడింది. వీటిలో ఫుకెట్ నగరం కూడా ఉంది. సోమవారం ఉదయం సమయానికి కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ, లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో చిన్న వాహనాలు వెళ్లకుండా అధికారులు సూచించారు.
వివరాలు
పలు చోట్ల విరిగిపడ్డ కొండచరియలు
ఫుకెట్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ రోమ్‌డోన్ హయియావే తెలిపారు.
వరదల కారణంగా కొట్టుకొచ్చిన మట్టి, ఇతర వ్యర్థాలు నీటి ప్రవాహానికి అడ్డంకులుగా మారకుండా వాటిని తొలగించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాల ఘటనలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.
అయితే సుమారు 100 కుటుంబాలు వరదల ప్రభావానికి గురైనట్లు పేర్కొన్నారు.
వివరాలు
బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం
దక్షిణ థాయిలాండ్‌లో బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో మరిన్ని ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపింది.
కాగా, సెప్టెంబర్ మధ్య నుంచి థాయిలాండ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వరదలు సంభవిస్తున్నాయి.
ఈ వరదల కారణంగా ఇప్పటివరకు కనీసం 83 మంది ప్రాణాలు కోల్పోయారు.
సెప్టెంబర్ చివర్లో రాజధాని బ్యాంకాక్ కూడా భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది.
దీంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.