Kim russia tour: ప్రత్యేక రైలులో రష్యాకు బయలుదేరిన కిమ్.. రేపు పుతిన్‌తో భేటీ!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మాస్కోకు బయలుదేరినట్లు దక్షిణ కొరియా వార్తా పత్రిక చోసున్ ఇల్బో తెలిపింది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి సోమవారం రైలు బయలుదేరిందని, మంగళవారం కిమ్-పుతిన్ భేటీ ఉండొచ్చని 'చోసున్ ఇల్బో' పత్రిక నివేదిక అంచనా వేసింది. అయితే దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాత్రం కిమ్ రష్యా పర్యటన గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉత్తర కొరియా- రష్యాలు అమెరికాతో తీవ్రస్థాయి ఘర్షణల నేపథ్యంలో తమ సహకారాన్ని విస్తరించుకునే క్రమంలో ఈ నెలలోనే కిమ్-పుతిన్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ గత వారమే ప్రకటించింది.
ఆయుధ కొనుగోళ్లపై కిమ్- పుతిన మధ్య చర్చలు?
ఉక్రెయిన్‌పై రష్యా ఏడాదిన్నరగా యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యాకు తీవ్రమైన ఆయుధాల కొరత ఏర్పడింది. ఆ కొరతను తీర్చేందుకు ఉత్తర కొరియాతో పుతిన్ చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ చర్చల కోసమే కిమ్ రష్యాకు పయనమైనట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా అందించే మందుగుండు సామగ్రికి బదులు కిమ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, సైనిక నిఘా ఉపగ్రహాలకు సంబంధించిన ఆయుధ సాంకేతికతలను కోరవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కిమ్- పుతిన్ భేటీ అవుతున్నాన్న వార్త నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ దేశాలపై ఒత్తిడి పెంచేందుకు కూడా ఈ భేటీ దోహదపడుతుందని పుతిన్ వ్యూహాత్మంగా కూడా భావించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.