Nithya Raman: అమెరికాలో భారతీయుల సత్తా.. లాస్ ఏంజెలెస్ మేయర్‌గా నిత్యా రామన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారత సంతతి నాయకులు వరుసగా కీలక పదవులను దక్కించుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన నిత్యా రామన్ (45) లాస్ ఏంజెలెస్ నగర మేయరుగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టనున్న తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నిత్యా రామన్.. 'డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా' మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచి సిటింగ్ మేయర్ కరెన్ బాస్‌ను ఓడించారు. ఈ ఎన్నికల్లో నిత్యా రామన్‌కు 52.1 శాతం ఓట్లు రాగా.. కరెన్ బాస్ 47.9 శాతం ఓట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఆమె విజయంతో అమెరికాలోని రెండు అతిపెద్ద నగరాల మేయర్ పదవుల్లో భారత సంతతి నేతలు కొనసాగనున్నట్లయింది.
వివరాలు
గతేడాది ఎన్నికైన విషయం తెలిసిందే
ఇప్పటికే అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ మేయరుగా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ సోషలిస్టు నేత జొహ్రాన్ మమ్దానీ గత ఏడాది ఎన్నికైన విషయం తెలిసిందే.
తాజాగా నిత్యా రామన్ లాస్ ఏంజెలెస్ మేయరుగా ఎన్నిక కావడంతో భారతీయ మూలాలున్న నేతలకు మరో కీలక పదవి దక్కినట్లయింది.
నిత్యా రామన్ గతంలో కరెన్ బాస్‌కు మద్దతుదారుగా ఉన్నారు. ఈ ఎన్నికలకు ముందు కూడా తొలుత ఆమె బాస్‌కే మద్దతు ప్రకటించారు.
అయితే నామినేషన్ల దాఖలుకు తుది గడువు ముగియడానికి కొద్దిసమయం ముందు అనూహ్యంగా తానే ఎన్నికల బరిలోకి దిగారు.
కేరళలో జన్మించిన నిత్యా రామన్.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశారు.
వివరాలు
మిషిగన్ హౌస్ స్పీకర్‌గా రంజీవ్ పురీ
అమెరికాలో భారత సంతతి నేతలకు మరో కీలక పదవి దక్కింది. మిషిగన్ ప్రతినిధుల సభ స్పీకర్‌గా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ పార్టీ నేత రంజీవ్ పురీ (42) ఎన్నికయ్యారు.
ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. అంతకుముందు 2020లో మిషిగన్ ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి సిక్కు అమెరికన్‌గా కూడా రంజీవ్ పురీ రికార్డు సాధించారు.
తాజాగా స్పీకర్ పదవిని దక్కించుకోవడంతో ఆయన మరో ఘనతను సొంతం చేసుకున్నారు.
వివరాలు
ఇల్లినోయీ ప్రతినిధుల సభకు సబా హైదర్ ఎన్నిక
భారత సంతతికి చెందిన మరో నాయకురాలు సబా హైదర్ కూడా అమెరికా ఎన్నికల్లో విజయం సాధించారు.
డెమోక్రటిక్ పార్టీ తరఫున ఇల్లినోయీ ప్రతినిధుల సభలోని 84వ డిస్ట్రిక్ట్ నుంచి ఆమె ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో సబా హైదర్‌కు 70.9 శాతం ఓట్లు లభించాయి.
దీంతో ఇల్లినోయీ రాష్ట్ర జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
ఇలా అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో భారత సంతతికి చెందిన నేతలు కీలక పదవులు దక్కించుకుంటున్నారు.