Sheikh Hasina: చంపినా సరే బంగ్లాదేశ్‌కు వెళ్తా.. హసీనా సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టు ముందు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వెల్లడించారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత తనను అరెస్టు చేసే అవకాశమున్నా,ప్రాణహాని ఎదురైనా వెనక్కి తగ్గబోనని ఆమె స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే,ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదని కూడా తెలిపారు.
వివరాలు
కోర్టుల్లో లొంగిపోవాలని నిర్ణయించుకున్న: హసీనా
హసీనా మాట్లాడుతూ.."స్వదేశానికి వెళ్లిన తర్వాత నన్ను అరెస్టు చేయవచ్చు.చంపే ప్రమాదం కూడా ఉంది. అయినప్పటికీ నేను వెళ్లాల్సిందే. నా పార్టీ అవామీ లీగ్ నాయకులు,కార్యకర్తలు తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ మరణం సంభవిస్తే.. నా తల్లిదండ్రులను సమాధి చేసిన నేలలోనే, నా సొంత దేశంలోనే చివరి శ్వాస విడవాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో తాను, అవామీ లీగ్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో కలిసి బంగ్లాదేశ్‌కు వెళ్లి కోర్టుల్లో లొంగిపోవాలని నిర్ణయించుకున్నామని హసీనా వెల్లడించారు. తనను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.నిరసనలను అణచివేసే చర్యల్లో హసీనా పాత్ర ఉందని ఆరోపిస్తూ బంగ్లాదేశ్‌లో ఆమెపై పలు కేసులు నమోదు చేశారు. అయితే, ఆ ఆరోపణలను హసీనా పూర్తిగా ఖండించారు.ఈ కేసులపై విచారణ చేపట్టిన బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ 2025లో హసీనాకు మరణశిక్ష విధించింది.
వివరాలు
షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌ను పలుమార్లు కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఇటీవల తాను స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన హసీనా.. ఈసారి డిసెంబర్‌లోనే తిరిగి వెళ్లే యోచన ఉందని స్పష్టంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా,షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను ఇప్పటికే పలుమార్లు కోరింది. ఈ అభ్యర్థనకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించింది.