
Trump Tariffs: ఈసారి ట్రక్కులపైనే దృష్టి.. 25% టారీఫ్‌లతో షాకిచ్చిన ట్రంప్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య పరంగా మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మధ్యస్థ, భారీ ట్రక్కులపై 25 శాతం టారీఫ్‌లు (Trump Tariffs)విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కొత్త సుంకాలు వచ్చే నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. అమెరికాలో వాహన ఉత్పత్తిని ప్రోత్సహించడం, స్థానిక తయారీని బలోపేతం చేయడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, అమెరికా ఆధారిత భాగస్వామ్య దేశాలు, జాయింట్ వెంచర్లు ఈ టారీఫ్‌ల నుంచి మినహాయింపు పొందే అవకాశముందనే అంచనాలున్నాయి. ఇప్పటికే ట్రంప్ గత నెలలోనే భారీ వాహనాల దిగుమతులపై సుంకాలు విధిస్తామని, అవి అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు.
Details
అమెరికా ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు
ఇప్పుడు ఆ ప్రకటనను మరింత స్పష్టంగా అమలుచేయబోతున్నట్లు ఈ తాజా నిర్ణయంతో వెల్లడైంది. ఈ టారీఫ్‌ల ప్రభావం చైనా, మెక్సికో, కెనడా, జర్మనీ, జపాన్, ఫిన్లాండ్ వంటి దేశాలపై ఎక్కువగా ఉండే అవకాశముందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొత్త సుంకాల అమలు విధానం, దాని పరిధి గురించి అమెరికా ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ప్రస్తుతం జపాన్, యూరోపియన్ యూనియన్ (EU) దేశాల నుంచి దిగుమతి చేసుకునే లైట్ డ్యూటీ వాహనాలపై 15 శాతం టారీఫ్‌లు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. తాజాగా విధించిన 25 శాతం సుంకాలు ఈ రేట్లను మరింత పెంచుతాయా లేదా అన్నది చూడాలి.