Justin Trudeau: మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చిన ట్రంప్.. స్పందించిన ట్రూడో
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాను "51వ రాష్ట్రంగా విలీనం చేయాలి" అనే తన ప్రతిపాదనను మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.
ఈ ప్రతిపాదనపై ట్రూడో స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదు. రెండు దేశాల కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యాల ద్వారా లాభాలను పొందుతున్నారు" అని పేర్కొన్నారు.
వివరాలు
ట్రంప్ కెనడా,మెక్సికోపై 25 శాతం సుంకం
ఇటీవల, ట్రంప్ కెనడా,మెక్సికోపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు.
ఆ తరువాత ట్రూడో ట్రంప్‌ను కలసి, వలసలు, డ్రగ్స్ అక్రమరవాణా వంటి సమస్యలను సరిహద్దుల్లోనే నియంత్రించాలని అభ్యర్థించారు.
ట్రంప్ తన మాటను పదిలం చేస్తూ, ఈ సమస్యలపై చర్యలు తీసుకోకపోతే సుంకాలు మరింత పెంచుతానని హెచ్చరించారు. అంతేకాక, "అయితే మీరు 51వ రాష్ట్రంగా విలీనమవడం ఉత్తమం" అంటూ వ్యంగ్యంగా ట్రూడోను "గవర్నర్ ఆఫ్ కెనడా"గా సంబోధించారు.
ట్రూడో త్వరలో తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు.
లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతారని తెలిపారు.
వివరాలు
అమెరికాలో విలీనమవడం కెనడాలో చాలామందికి ఇష్టమే
తన వారసుడిని పార్టీ ఎన్నుకునే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టంచేశారు.
ప్రధానమంత్రి పదవిని మార్క్ కార్నీ లేదా లీ బ్లాంక్‌లలో ఎవరో ఒకరు చేపట్టే అవకాశముందని సమాచారం.
ఈ పరిణామాల మధ్య, ట్రంప్ కెనడాను అమెరికాలో భాగంగా చేసేందుకు తన ప్రతిపాదనను మరలా నొక్కిచెప్పారు.
"అమెరికాలో విలీనమవడం కెనడాలో చాలామందికి ఇష్టమే. దీనివల్ల సుంకాలు, అధిక పన్నులు ఉండవు. అలాగే, రష్యా, చైనా నుండి వచ్చే నౌకల ముప్పు కూడా తగ్గుతుంది" అని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ట్రూడో తాజాగా ఘాటుగా స్పందించారు, "అది అసాధ్యం" అని స్పష్టంగా తెలిపారు.