H-1B Visa: హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం కల్పిస్తున్న 60రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేలా నిబంధనను ప్రతిపాదించింది. 'ఎలిమినేటింగ్ ద డిస్క్రీషనరీ 60-డే గ్రేస్ పీరియడ్' పేరుతో రూపొందించిన ఈ ప్రతిపాదిత నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టరులో ప్రచురించనుంది. ఈ ప్రతిపాదనపై ఆసక్తి ఉన్నవారు 60 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్టుమెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్)తెలిపింది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయ టెక్ ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.
వివరాలు
టీఎన్ వలసేతరులకు కూడా కొత్త నిబంధన
ప్రస్తుతం హెచ్1బీ వీసాపై ఉన్న ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు, మరో సంస్థలో ఉద్యోగం పొందేందుకు గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంది.
అయితే ప్రతిపాదిత నిబంధన ఆమోదం పొందితే ఈ వెసులుబాటు తొలగిపోతుంది.
వీసా గడువు ఇంకా ఉన్నప్పటికీ ఉద్యోగం కోల్పోయిన వెంటనే విదేశీ ఉద్యోగి అమెరికాను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రత్యేకంగా ఉండేందుకు అనుమతి లేదా ఆథరైజేషన్ ఉంటేనే అమెరికాలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్ వర్తిస్తున్న పలు వీసా కేటగిరీలపైనా ఈ ప్రతిపాదన ప్రభావం చూపనుంది.
ఈ1, ఈ2, ఈ3, హెచ్1బీ, హెచ్1బీ1, ఎల్1, ఓ1 వీసాదారులతో పాటు టీఎన్ వలసేతరులకు కూడా కొత్త నిబంధన వర్తించనుంది.
వివరాలు
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ గ్రేస్ పీరియడ్
2016లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ గ్రేస్ పీరియడ్‌ను ప్రవేశపెట్టారు.
ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు వెంటనే అమెరికా విడిచి వెళ్లకుండా, మరో ఉద్యోగాన్ని వెతుక్కునేందుకు వీలుగా ఈ సౌకర్యాన్ని కల్పించారు.
ముఖ్యంగా హెచ్1బీ వంటి వీసాలపై పనిచేస్తున్న వారికి ఉద్యోగ మార్పు ప్రక్రియలో ఇది కొంత వెసులుబాటును అందించింది.
ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్‌ను తొలగిస్తే, ప్రభావితమైన విదేశీ ఉద్యోగులకు డీహెచ్‌ఎస్ 'నోటీసెస్ టూ అప్పియర్' (ఎన్‌టీఏ) జారీ చేసే అవకాశం ఉంది.
అమెరికాలో వారి వలస స్థితికి సంబంధించిన తదుపరి చర్యలకు ఇది తొలి దశగా పరిగణిస్తారు. అనంతరం వారిని స్వదేశాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
వివరాలు
2025లో హెచ్1బీ వీసాదారుల సంఖ్య 65,752
డీహెచ్‌ఎస్ గణాంకాల ప్రకారం.. 2025లో ఉద్యోగాలను కోల్పోయిన లేదా ఉద్యోగాలు మార్చుకున్న హెచ్1బీ వీసాదారుల సంఖ్య 65,752గా ఉంది.
ఇక 2023లో ఈ సంఖ్య అత్యధికంగా నమోదైంది. ఆ ఏడాది 80,034 మంది ఉద్యోగాలు మారడం లేదా ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించడం జరిగినట్లు డీహెచ్‌ఎస్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.