Trump: ట్రంప్‌కు భారీ విరాళం.. వాషింగ్టన్ అభివృద్ధి నిధికి $300 మిలియన్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వాషింగ్టన్ డీసీ పునరుద్ధరణ పనులకు భారీగా నిధులు అందాయి. అయితే, సెప్టెంబర్‌లో ఈ నిధికి ఏకంగా 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,500 కోట్లకు పైగా) విరాళంగా వచ్చాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరు ఇచ్చారనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. ప్రభుత్వ రికార్డుల్లోనూ విరాళం ఇచ్చిన వారి వివరాలు లేవని, ట్రంప్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని వెల్లడించలేదని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
వివరాలు
నేషనల్ పార్క్ సర్వీస్ ఖాతాకు భారీగా విరాళాలు
ఈ విరాళాలు నేషనల్ పార్క్ సర్వీస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి.
ట్రంప్ చేపడుతున్న పలు ప్రత్యేక ప్రాజెక్టులకు ఈ ఖాతా నుంచి నిధులు ఖర్చు చేస్తున్నారు.
వైట్‌హౌస్‌లో భారీ బాల్‌రూమ్ నిర్మాణం, లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ పునరుద్ధరణ వంటి పనులకు ఈ నిధులను ఉపయోగిస్తున్నారు.
వాస్తవానికి జాతీయ పార్కుల అభివృద్ధి కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఖాతాను ఏర్పాటు చేశారు.
గతంలో ఈ ఖాతాకు ఏడాదికి 100 మిలియన్ డాలర్ల కంటే తక్కువ మొత్తమే విరాళాల రూపంలో వచ్చేది.
అయితే, 2025లో ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 790 మిలియన్ డాలర్లు అందినట్లు సమాచారం.
వివరాలు
అంచనాలకు మించి విరాళాలు.. పారదర్శకతపై ప్రశ్నలు
ట్రంప్ ప్రభుత్వం ఈ నిధులపై స్పందిస్తూ.. గత ప్రభుత్వాలు వాషింగ్టన్ నగరాన్ని నిర్లక్ష్యం చేశాయని, ట్రంప్ మాత్రం నగరాన్ని సురక్షితంగా, అందంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది.
అయితే, ఈ భారీ విరాళాల వెనుక ఎవరున్నారనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సెప్టెంబర్ నెలలో 50 మిలియన్ డాలర్ల విరాళాలు వస్తాయని భావించామని, కానీ దాదాపు 347 మిలియన్ డాలర్లు అందాయని అంతర్గత వ్యవహారాల శాఖలో చాలాకాలంగా న్యాయవాదిగా పనిచేస్తున్న టోనీ ఐరిష్ వెల్లడించారు.
ఈ భారీ మొత్తాన్ని ఆయనే గుర్తించారు.
వివరాలు
ప్రముఖ కంపెనీల విరాళాలు.. దాతల వివరాలపై గోప్యత!
"విరాళాలు ఇచ్చినవారు ప్రతిఫలంగా ప్రభుత్వ ప్రయోజనాలను ఆశిస్తున్నారా? అనే విషయం మాకు తెలియదు. ఎందుకంటే ఈ విరాళాల విషయంలో పారదర్శకత లేదు" అని ఆయన న్యూయార్క్ టైమ్స్‌తో అన్నారు.
మరోవైపు, ట్రంప్ చేపట్టిన ప్రాజెక్టులకు ఆపిల్, ఎన్విడియా, గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ వంటి ప్రముఖ కంపెనీలు భారీగా విరాళాలు ఇచ్చినట్లు వాషింగ్టన్ పోస్ట్ గతంలో ఓ కథనంలో పేర్కొంది.
అయితే, ఈ సంస్థలు ఇచ్చిన విరాళాలు వైట్‌హౌస్ బాల్‌రూమ్ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్న లాభాపేక్షలేని ట్రస్ట్ ఫర్ ది నేషనల్ మాల్ ఖాతాకు కాకుండా, వేరే ఖాతాకు సంబంధించినవని సమాచారం.
వివరాలు
దాతల వివరాలపై మౌనం.. ట్రంప్‌పై వైట్‌హౌస్ ప్రశంసలు
విరాళాలు ఇచ్చిన వారి వివరాలను వెల్లడించేందుకు వైట్‌హౌస్ లేదా అంతర్గత వ్యవహారాల శాఖ అంగీకరించలేదు.
అయితే, అమెరికా రాజధానిని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే నగరంగా మార్చేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని ప్రశంసించింది.
"ఈ దేశ చరిత్రలో మరే అధ్యక్షుడూ చేయనంతగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజధాని అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వాలు నగరాన్ని నిర్లక్ష్యం చేస్తే, ట్రంప్ దాన్ని మళ్లీ సురక్షితంగా, అందంగా తీర్చిదిద్దుతున్నారు. వైట్‌హౌస్‌లో అనుభవజ్ఞుడైన నిర్మాణ నిపుణుడు అధ్యక్షుడిగా ఉండటం మనందరి అదృష్టం" అని వైట్‌హౌస్ ప్రతినిధి తెలిపారు.