Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌పై వేటు.. ఖండించిన వైట్‌హౌస్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ (Kash Patel) బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించబోతున్నారన్న ప్రచారం విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్తలను వైట్ హౌస్ పూర్తిగా తిప్పికొట్టింది. పలు హై-ప్రొఫైల్ దర్యాప్తుల నడుమ కాష్ పటేల్ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టడం,అలాగే ఇటీవల తన ప్రియురాలిని కలవడానికి ప్రభుత్వానికి చెందిన విమానంలో ప్రయాణించడం వంటి కారణాలతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంగానే పటేల్‌ను డైరెక్టర్ పదవి నుంచి తప్పించాలని ట్రంప్ నిర్ణయించుకున్నారని మీడియాలో కథనాలు వెలిశాయి.
వివరాలు
ఈ వార్తలు అధ్యక్షుడికి నవ్వు తెప్పించాయి
ఆ స్థానాన్ని ప్రస్తుతం కో-డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆండ్రూ బెయిలీకి అప్పగించాలన్న వ్యాఖ్యలు కూడా అందులో వచ్చాయి. ఈ ప్రచారంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ, ఆ వార్తలన్నీ పూర్తిగా కట్టుకథలేనని స్పష్టం చేశారు. అవన్నీ అసత్య ప్రచారమని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వార్తలు అధ్యక్షుడికి నవ్వు తెప్పించాయన్నారు. ట్రంప్, పటేల్‌లతో ఉన్న ఫోటోను పంచుకుంటూ.. అయనను తొలగించనున్నారన్న వార్తలకు తాము చెక్ పెట్టామని తెలిపారు. అయితే, ఎఫ్‌బీఐ మాత్రం ఈ విషయం పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలోనూ ట్రంప్, పటేల్‌ను ప్రశంసలతో ముంచెత్తుతూ అతడిపై తనకు గట్టి విశ్వాసం ఉందని చెప్పారు.
వివరాలు
ఆ ఖర్చును ప్రభుత్వానికి తిరిగి చెల్లించడం తప్పనిసరి
ఇటీవలి కాలంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై పలు ఆరోపణలు బయటకు వచ్చాయి. తన ప్రియురాలి సంగీత కార్యక్రమానికి వెళ్లేందుకు 60 మిలియన్ డాలర్ల విలువైన ప్రభుత్వ విమానాన్ని వినియోగించారని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఆరోపించారు. భద్రతా కారణాల వల్ల ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు అధికారిక విమానం వ్యక్తిగత ప్రయాణాలకు ఉపయోగించే అనుమతి ఉన్నా, ఆ ఖర్చును ప్రభుత్వానికి తిరిగి చెల్లించడం తప్పనిసరి. అయితే, పటేల్ ఆ మొత్తాన్ని చెల్లించలేదనే ఆరోపణలు వెలిశాయి.
వివరాలు
విమానాన్ని అనేకసార్లు వాడినట్లు ప్రచారం
గతంలో కూడా ఆయన వ్యక్తిగత పనుల కోసం అదే విమానాన్ని అనేకసార్లు వాడినట్లు ప్రచారం జరిగింది. ఇంకా, ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఫ్రాంక్ ఫిగ్లీజీ—పటేల్ బ్యూరో ప్రధాన కార్యాలయంలో కంటే నైట్‌క్లబ్‌ల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల శ్రేణి మధ్య ట్రంప్ ఆయనను పదవి నుంచి తొలగించడానికి సిద్ధమయ్యారన్న కథనాలు బయటకు వచ్చాయి. అయితే వైట్ హౌస్ ధృవీకరణతో ఆ ప్రచారాలకు తాత్కాలికంగా తెరపడినట్టైంది.