
Donald Trump: ట్రంప్‌నకు ఖతార్ రాజకుటుంబం విమానం గిఫ్ట్..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ఖతార్ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్ 737 విమానాన్ని బహుమతిగా ఇవ్వనుందని ప్రకటించారు.
అయితే, ఇలాంటి బహుమతిని స్వీకరించడం అనైతికమని వచ్చిన విమర్శలను ఆయన ఖండించారు.
దాదాపు 400 మిలియన్ డాలర్ల విలువగల ఈ విలాసవంతమైన విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఈ విమానాన్ని 'ఎయిర్ ఫోర్స్‌వన్' తరహాలో ఉపయోగించాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షులకు అందిన బహుమతులలో ఇదే అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్నారు.
అయితే దీనిపై వస్తున్న విమర్శలపై ట్రంప్ స్పందిస్తూ, ''ఇంత పెద్ద మనసుతో ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని తిరస్కరించడానికి నేను మూర్ఖుడిని కాదు''అని వ్యాఖ్యానించారు.
వివరాలు
పశ్చిమాసియాలో ట్రంప్ పర్యటన మొదలు..!
పశ్చిమాసియా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ఈ విమానాన్ని తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించబోనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దీన్ని ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి ఇవ్వనున్నట్లు తెలిపారు.
అయితే, ఖతార్ అధికార ప్రతినిధి మాత్రం ఈ విషయాన్ని ఖండించారు.
విమానాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా తప్పని పేర్కొన్నారు.
తాత్కాలికంగా ఓ విమానాన్ని ఉపయోగించేందుకు అనుమతించడంపై మాత్రమే చర్చలు జరిగాయని వివరించారు.
డొనాల్డ్ ట్రంప్ తన పశ్చిమాసియా పర్యటనలో భాగంగా నేడు సౌదీ అరేబియాకు చేరుకున్నారు.
రియాద్ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్‌కు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు.
వివరాలు
నాలుగు రోజుల పాటు ఈ పర్యటన
ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఇదే అయనకి తొలి పెద్ద విదేశీ పర్యటన.
ఈ పర్యటనలో ట్రంప్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ దేశాలను సందర్శించనున్నారు.
ట్రంప్‌తో పాటు ఈ పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్, ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ కూడా ఉన్నారు.
మొత్తం నాలుగు రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది.
వివరాలు
ప్రతిష్టాత్మక విందు, ప్రముఖ సీఈవోల హాజరు
ఈరోజు ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అనేక దిగ్గజ సంస్థల సీఈవోలు హాజరవుతున్నట్లు సమాచారం.
వీరిలో అమెజాన్, ఎన్విడియా, ఓపెన్‌ఏఐ, ఉబర్, కోకాకోలా, గూగుల్, బోయింగ్ సంస్థల సీఈవోలు ఉంటారని పేర్కొన్నారు.
అలాగే టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ కూడా ఈ విందులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ తాను తుర్కియేకు కూడా వెళ్లే అవకాశముందని స్వయంగా వెల్లడించారు.
ఈ నెల 15వ తేదీ నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతిచర్చలు ప్రారంభం కావనున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తాను నేరుగా భేటీ అయ్యే అవకాశముందన్నారు.