Trump: ఇరాన్‌పై అమెరికా గెలిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై అమెరికా విజయం సాధిస్తే.. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధంలో అమెరికా పైచేయి సాధిస్తే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు గణనీయంగా పడిపోతాయని పేర్కొన్నారు. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు చేరే అవకాశముందని చెప్పారు. ఈ విషయాలను ట్రంప్ తన 'ట్రూత్' సోషల్ మీడియా వేదికలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభానికి పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న ఘర్షణలే ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో ఇరాన్,అమెరికా నౌకల రాకపోకలను నియంత్రిస్తుండటం ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతోంది. దీంతో యుద్ధానికి ముందు పరిస్థితులతో పోలిస్తే చమురు, ఇతర ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
వివరాలు
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి
అమెరికా విజయం సాధించినప్పుడే ఇంధన మార్కెట్లలో మళ్లీ స్థిరత్వం నెలకొంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకునే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
ఇరాన్‌కు అణ్వాయుధం అభివృద్ధి చేసే అవకాశం తాము ఎప్పటికీ ఇవ్వబోమని పునరుద్ఘాటించారు.
అమెరికాపై దాడులు జరిగితే అదే స్థాయిలో ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
వివరాలు
కెనడాతో ట్రేడ్‌వార్ మరింత తీవ్రం
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం కూడా మళ్లీ వేడెక్కుతోంది.
కెనడాకు చెందిన విమానాల తయారీ సంస్థ బాంబార్డియర్‌పై ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఆ సంస్థ తయారు చేసే విమానాలను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
బాంబార్డియర్ తన తయారీ కార్యకలాపాలను అమెరికాకు తరలించాలని ట్రంప్ సూచించారు.
అలా చేయకపోతే ఆ సంస్థ విమానాల విక్రయాలను అమెరికాలో నిషేధిస్తామని హెచ్చరించారు.
అమెరికా-కెనడా మధ్య ఇటీవల జరిగిన వాణిజ్య చర్చలు చివరి దశలో విఫలమయ్యాయి.
అప్పటి నుంచి కెనడాపై ట్రంప్ మరింత కఠినంగా స్పందిస్తున్నారు.
తాజా బాంబార్డియర్ హెచ్చరికతో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.