Loading...
H-1b visa: 'గ్రేస్‌ పీరియడ్‌'పై ట్రంప్‌ కన్ను.. హెచ్‌-1బీ వీసాదారులకు మరో ముప్పు
'గ్రేస్‌ పీరియడ్‌'పై ట్రంప్‌ కన్ను.. హెచ్‌-1బీ వీసాదారులకు మరో ముప్పు

H-1b visa: 'గ్రేస్‌ పీరియడ్‌'పై ట్రంప్‌ కన్ను.. హెచ్‌-1బీ వీసాదారులకు మరో ముప్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా అమెరికాలో ఉండేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపించిన ప్రతిపాదనలను 'ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్' (OMB) ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. హెచ్‌-1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికా వీడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

వివరాలు

హెచ్‌-1బీ నిబంధనల్లో వరుస మార్పులు

అమెరికాలో విదేశీ నిపుణులు ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే కొత్త హెచ్‌-1బీ వీసాపై లక్ష డాలర్ల రుసుమును విధించింది.

ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులను వీలైనంత త్వరగా అమెరికా నుంచి పంపించాలనే ఉద్దేశంతో.. వారికి కల్పిస్తున్న గ్రేస్ పీరియడ్‌ను తొలగించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

వివరాలు

ప్రస్తుతం 60 రోజుల గడువు

ప్రస్తుతం లేఆఫ్‌లు లేదా ఇతర కారణాల వల్ల హెచ్‌-1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే.. మరో ఉద్యోగం వెతుక్కునేందుకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ అందుబాటులో ఉంది. ఈ సమయంలో వారు కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.

కొత్త సంస్థలో చేరిన తర్వాత హెచ్‌-1బీ వీసాను బదిలీ చేసుకోవడం లేదా తమ వీసా హోదాను మార్చుకోవాల్సి ఉంటుంది.

ఈ 60 రోజుల వ్యవధిలో అలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం అమెరికాను విడిచి స్వదేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.

అయితే ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పులు అమల్లోకి వస్తే.. ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు ప్రస్తుతం ఉన్న ఈ 60 రోజుల వెసులుబాటు కూడా లేకుండా పోయే అవకాశం ఉంది.

ADVERTISEMENT