Donald Trump: యూకేపై ట్రంప్ ఫైర్.. స్టార్మర్ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం యూఎస్, యూకే సంబంధాలపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమాసియా ప్రాంతానికి విమాన వాహక నౌకలను పంపే విషయంలో యూకే ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే విమాన వాహక నౌకను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీన్ని పశ్చిమాసియాకు పంపాలా లేదా అన్న విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆ దేశానికి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.
Details
ఆ నౌకల అవసరం లేదు
ఈ పరిణామాల మధ్య ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక Truth Socialలో స్టార్మర్‌ను విమర్శిస్తూ పోస్టు చేశారు. ఒకప్పుడు యూకే అమెరికాకు కీలక మిత్రదేశమని పేర్కొన్న ఆయన, పశ్చిమాసియాకు రెండు విమాన వాహక నౌకలను పంపే విషయంలో బ్రిటన్ తీవ్రంగా ఆలోచించడం విమర్శనీయమని అన్నారు. ప్రస్తుతం అమెరికా బలగాలకు ఆ నౌకల అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. యుద్ధం గెలిచిన తర్వాత మాత్రమే చేరే వ్యక్తులు తమకు అవసరం లేదని, ఈ చర్యను తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని స్టార్మర్‌కు హెచ్చరికలు చేశారు.
Details
బ్రిటన్ చర్యల వల్ల సంతోషంగా లేను
ఇక ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా కొనసాగిస్తున్న యుద్ధంలో తమ బలగాలు ప్రత్యక్షంగా పాల్గొనబోవని బ్రిటన్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఆత్మరక్షణ అవసరాల కోసం తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుమతిస్తామని స్టార్మర్ ఇటీవల వెల్లడించారు. ఈ నిర్ణయంపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బ్రిటన్ చర్యలతో తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు.
Details
కుర్దుల అవసరం లేదన్న ట్రంప్
ఇటీవల ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుర్దులు కలిసి రావాలని ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన స్వరాన్ని మార్చుకున్నారు. ఇరాన్‌పై దాడి చేయడానికి కుర్దుల అవసరం లేదని తెలిపారు. అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, కుర్దులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఈ యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాలని తమకు ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.