Page Loader
Trump: 'అయన పని తీరును హూతీలనే అడగండి'.. పీట్‌ హెగ్సెత్‌పై ఆరోపణలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
పీట్‌ హెగ్సెత్‌పై ఆరోపణలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

Trump: 'అయన పని తీరును హూతీలనే అడగండి'.. పీట్‌ హెగ్సెత్‌పై ఆరోపణలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2025
11:12 am

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్‌పై దాడికి ముందు జరిగిన ఒక అత్యంత రహస్య విషయాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌ తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, హెగ్సెత్‌పై వచ్చిన విమర్శలను ఖండించారు. హెగ్సెత్‌ అద్భుతమైన విధంగా పని చేస్తున్నారని పేర్కొన్న ట్రంప్, దీనిపై స్పష్టత కోరాలంటే హూతీలను అడగవచ్చని సూచించారు. ట్రంప్‌ అభిప్రాయం ప్రకారం, అసంతృప్తి చెందిన కొంతమంది ఉద్యోగులు హెగ్సెత్‌పై అవాస్తవ ఆరోపణలు చేస్తూ, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నెగెటివ్ ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు.

వివరాలు 

హెగ్సెత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైట్‌ హౌస్

అంతేగాక, పెంటగాన్‌లో (అమెరికా రక్షణశాఖ కేంద్ర కార్యాలయం) పని చేస్తున్న కొంతమంది అవినీతి దోపిడీకి అలవాటుపడ్డ వ్యక్తులను తాను తొలగించేందుకు చర్యలు తీసుకుంటుండటమే, ఈ తప్పుడు ఆరోపణలకు కారణమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వైట్‌ హౌస్ కూడా హెగ్సెత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇక ఈ ఆరోపణలపై స్వయంగా హెగ్సెత్ స్పందిస్తూ,తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. పెంటగాన్‌లో ఉన్న కొంతమంది మాజీ ఉద్యోగులు తనను పదవి నుంచి తొలగించేందుకు కావాలని ఈవిధంగా ఆరోపణలు చేస్తుండటాన్ని ఆయన విమర్శించారు. రక్షణశాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేస్తున్న ఉద్యోగులను తాను తొలగించిన వెంటనే తనపై విమర్శలు వెల్లువెత్తడం అనేది అత్యంత ఆశ్చర్యకరమని అన్నారు.

వివరాలు 

యుద్ధ ప్రణాళిక సిగ్నల్‌ యాప్‌ గ్రూప్‌చాట్‌ ద్వారా లీక్ 

రుజువులు లేని, నిరాధార సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కథనాలు ప్రచురించడం మీడియా సంస్థలకు అలవాటైపోయిందని హెగ్సెత్ మండిపడ్డారు. ఈ ఏడాది మార్చి 15న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యెమెన్‌పై దాడులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ, ఆ ప్రకటనకు ముందే ఈ యుద్ధ ప్రణాళిక సిగ్నల్‌ అనే యాప్‌లోని గ్రూప్‌చాట్‌ ద్వారా లీకైనట్లు తెలుస్తోంది. హెగ్సెత్‌ విదేశీ ప్రతినిధులతో జరిపే రహస్య సమావేశాలకు తన సతీమణిని కూడా తీసుకువెళ్తుండటంతో, సున్నితమైన సమాచారం బయటకు వెళ్లే అవకాశాలపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

ఫాక్స్ న్యూస్‌లో ప్రొడ్యూసర్‌గా జెన్నిఫర్‌ హెగ్సెత్

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక కథనం ప్రకారం, హెగ్సెత్ రెండవ సిగ్నల్‌ గ్రూప్‌చాట్‌ ద్వారా తన కుటుంబసభ్యులతో - భార్య జెన్నిఫర్‌, సోదరుడు ఫిల్ హెగ్సెత్‌తో - యుద్ధానికి సంబంధించిన ప్రణాళిక వివరాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. జెన్నిఫర్‌ హెగ్సెత్ గతంలో ఫాక్స్ న్యూస్‌లో ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఇక ఫిల్ హెగ్సెత్ అమెరికా హోంల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అడ్వైజర్‌ హోదాలో కొనసాగుతున్నారు.