Pezeshkian: మా హక్కులపై జోక్యం చేసుకునే హక్కు ట్రంప్‌కు లేదు.. ఇరాన్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌కు ఉన్న చట్టబద్ధమైన అణు హక్కులను హరించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పష్టం చేశారు. అణు హక్కులను వినియోగించకూడదని తమపై ఆంక్షలు విధిస్తున్నారని, అయితే ఏ నేరానికి ఈ శిక్ష విధిస్తున్నారో చెప్పడం లేదని విమర్శించారు. ఒక దేశానికి చెందిన హక్కులను హరించడానికి ట్రంప్ ఎవరో ప్రశ్నించారు. ఇరాన్ యుద్ధాన్ని విస్తరించే ఉద్దేశం తమకు లేదని, దేశంలో శాంతి, స్థిరత్వం, భద్రతను కాపాడటం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గౌరవప్రదంగా యుద్ధానికి ముగింపు పలకాలని తాము కోరుకుంటున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచించారు.
వివరాలు
ఏ దేశమూ ఇరాన్ ను వశపరచుకోలేదు
అణు ఇంధనాన్ని అభివృద్ధి చేసుకోవడం తమ హక్కు అని స్పష్టం చేసిన పెజెష్కియాన్, దానిపై ఆంక్షలు విధించిన ఏ దేశమూ ఇరాన్‌ను వశపరచలేకపోయిందని అన్నారు. యురేనియం శుద్ధిపై అమెరికా విధిస్తున్న పరిమితులను ఆయన ఖండిస్తూ, ఈ విషయంలో తమకు ఎవరి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. టెహ్రాన్ ఎప్పుడూ స్వయంగా ఘర్షణలు ప్రారంభించలేదని, కానీ తమపై ఎవరైనా దాడి చేస్తే తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కారణం లేకుండా ఇతర దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, అమెరికాతో రెండో దశ చర్చలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది.