Trump: భారత సౌర ఉత్పత్తులపై 126% సుంకం.. ట్రంప్ సంచలన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని మరో కీలక నిర్ణయం ప్రకటించారు. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రపంచ దేశాలపై ట్రంప్ అమలు చేసిన గ్లోబల్ టారిఫ్‌లను ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే ఆ నిర్ణయం వెలువడిన వెంటనే ట్రంప్ ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ సుంకాన్ని 15 శాతానికి పెంచారు. ఇటీవల అమెరికా పార్లమెంటులో జరిగిన వార్షిక ప్రసంగంలో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు.
వివరాలు
భారత్ నుండి అమెరికాకు జరిగిన సౌరశక్తి దిగుమతుల విలువ 792.6మిలియన్ డాలర్లు
భారతదేశం,ఇండోనేషియా,లావోస్ దేశాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం వరకు సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. ఈ మూడుదేశాల నుంచే అమెరికాకు భారీ స్థాయిలో సౌరశక్తి ఉత్పత్తులు దిగుమతి అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికా వాణిజ్యశాఖ గణాంకాల ప్రకారం 2024లో భారతదేశం నుంచి అమెరికాకు జరిగిన సౌరశక్తి దిగుమతుల విలువ 792.6మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది గతసంవత్సరాలతో పోల్చితే గణనీయమైన వృద్ధిని సూచిస్తోంది. అదేసమయంలో ట్రంప్ లక్ష్యంగా పేర్కొన్న భారతదేశం,ఇండోనేషియా,లావోస్ దేశాల నుంచి 2024లో సుమారు 4.5బిలియన్ డాలర్ల విలువైన సౌర ఉత్పత్తులు అమెరికాకు చేరాయి. అంతేకాకుండా 2025 తొలి ఆరునెలల్లో అమెరికా సౌర మాడ్యూల్ దిగుమతుల్లో 57శాతం వాటా ఈ మూడు దేశాలదేనని నివేదికలు వెల్లడించాయి.
వివరాలు
దిగుమతి అయ్యే సౌర ఉత్పత్తులపై 126 శాతం సుంకం
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం భారతదేశం నుంచి దిగుమతి అయ్యే సౌర ఉత్పత్తులపై అమెరికా వాణిజ్య శాఖ 126 శాతం సుంకాన్ని ఖరారు చేసింది. ఇండోనేషియాపై ఈ సుంకం 86 శాతం నుంచి 143 శాతం వరకు ఉండగా,లావోస్‌పై 81శాతం విధించారు. ఈ సుంకాల లెక్కల్లో విదేశీ సబ్సిడీల అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సంబంధిత దేశాల ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను అమెరికా దేశీయ తయారీదారుల కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నారని అమెరికా భావిస్తోంది. భారీ స్థాయి సుంకాలు విధించడం ద్వారా దేశీయ సౌర తయారీ రంగాన్ని రక్షించి,ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.