H-1B visa shock: హెచ్-1బీపై 1.03 లక్షల డాలర్ల వడ్డన.. కొత్త రుసుమును ప్రతిపాదించిన ట్రంప్ సర్కారు
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై కొత్తగా 1,03,265 డాలర్ల రుసుము విధించే ప్రతిపాదనను సోమవారం తీసుకొచ్చింది. హెచ్-1బీ వీసా క్యాప్ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తులకు ఈ ఫీజు వర్తిస్తుందని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపునకు అర్హత ఉన్న దరఖాస్తులు కూడా ఇందులోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే హెచ్-1బీ వీసా క్యాప్ నుంచి మినహాయింపు పొందిన దరఖాస్తులకు మాత్రం ఈ అదనపు రుసుము వర్తించదని తెలిపింది.
వివరాలు
ఈ కొత్త నిర్ణయంపై న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం
ఇప్పటికే అమల్లో ఉన్న హెచ్-1బీ దరఖాస్తు రుసుముకు అదనంగా ఈ 1,03,265డాలర్లను ప్రత్యేక ఫీజుగా వసూలు చేయాలని ప్రతిపాదించారు.
ఈప్రతిపాదనకు సంబంధించిన నోట్‌ను ఫెడరల్ రిజిస్టర్‌లో పోస్ట్ చేశారు.
దీనిని మంగళవారం అధికారికంగా ప్రచురించే అవకాశం ఉంది. అనంతరం 30రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు.
ఈ ఏడాది ముగిసేలోపే కొత్త ఫీజును అమల్లోకి తీసుకురావాలని డీహెచ్‌ఎస్ భావిస్తున్నట్లు సమాచారం.
హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్ సర్కారు గత ప్రణాళికకు ఇప్పటికే న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.
అయినప్పటికీ ఇప్పుడు మరోసారి భారీ ఫీజు ప్రతిపాదనను తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ కొత్త నిర్ణయాన్ని సవాలు చేస్తూ కూడా న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
వివరాలు
ఏటా 65 వేల హెచ్-1బీ వీసాలకే పరిమితి
అమెరికా కాంగ్రెస్ ప్రతి ఏడాది గరిష్ఠంగా 65 వేల హెచ్-1బీ వీసాలను మంజూరు చేసేలా పరిమితి విధించింది.
దీనినే రెగ్యులర్ క్యాప్ అని పిలుస్తారు. అమెరికాలోని కళాశాలల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత పొందిన ఉద్యోగుల కోసం మరో 20 వేల హెచ్-1బీ వీసాలను అదనంగా కేటాయించారు.
ఈ విభాగాన్ని మాస్టర్స్ క్యాప్ అని వ్యవహరిస్తారు. దీనినే అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపుగా కూడా పిలుస్తారు.
వివరాలు
భారతీయ నిపుణులకు భారీ దెబ్బ!
కొత్తగా ప్రతిపాదించిన ఫీజు అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడాలని కోరుకునే భారతీయ నిపుణులపై తీవ్ర ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన హెచ్-1బీ పిటిషన్లలో ఏకంగా 71 శాతం భారతీయులవే కావడం గమనార్హం.
దీంతో కొత్త ఫీజు ప్రతిపాదన ఎక్కువగా భారతీయ నిపుణులు, ఉద్యోగ ఆశావహులపై ప్రభావం చూపే అవకాశముంది.
వివరాలు
ఎఫ్-1 ఓపీటీపై కూడా భారీ ఫీజు?
మరోవైపు ఎఫ్-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపీటీ)ప్రోగ్రామ్‌పైనా దాదాపు లక్ష డాలర్ల మేర కొత్త రుసుము విధించే ఆలోచనలో ట్రంప్ సర్కారు ఉన్నట్లు న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ'ఫ్రాగొమెన్'పేర్కొంది.
ఈనిర్ణయం కూడా అమల్లోకి వస్తే అమెరికాలో చదువుకోవాలని భావించే విదేశీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
చాలామంది భారతీయ విద్యార్థులు ఎఫ్-1 విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్తున్నారు.
అక్కడ తమ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన తర్వాత ఓపీటీప్రోగ్రామ్ ద్వారా చదివిన రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో పనిచేసే అవకాశం పొందుతున్నారు.
అనంతరం చాలామంది హెచ్-1బీవీసా ద్వారా అమెరికాలో తమ ఉద్యోగాలను కొనసాగించాలని ప్రయత్నిస్తుంటారు.
దీంతో హెచ్-1బీతో పాటు ఓపీటీపై కూడా భారీ ఫీజుల ప్రతిపాదనలు భారతీయ విద్యార్థులు,నిపుణుల్లో ఆందోళన కలిగించే అవకాశం ఉంది.